ఒకరు పోతేనే.. ఇంకొకరికి!

by  |
Beds full
X

దిశ, తెలంగాణ బ్యూరో : సెకండ్ వేవ్ కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌లు ఫుల్ అయిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో అడ్మిషన్ కోసం వెళ్తే ఒకరు పోతేనే మరొకరికి బెడ్ దొరుకుతుంది. అప్పటికే చికిత్స పొందుతున్న పేషెంట్ డిశ్చార్జి కావాలి లేదంటే ప్రాణం పోవాలి. అప్పుడే కొత్తగా చేరాలనుకున్న పేషెంట్‌కు బెడ్ దొరుకుతుంది. హైదరాబాద్ నగరంలోని అన్ని కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. గత రెండు వారాలుగా అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇదే కొనసాగుతోంది. మహారాష్ట్రలో కేసులు ఎక్కువ కావడంతో అక్కడి ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకనివారు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. దీంతో ఊహించని డిమాండ్ ఏర్పడింది. సగానికి పైగా ఇన్‌పేషెంట్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారేనని మంత్రి ఈటల రాజేందర్ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించడం అందులో భాగమే.

ప్రభుత్వాస్పత్రుల్లో విచిత్రమైన పరిస్థితి చోటుచేసుకుంది. ఆస్పత్రి దగ్గర డిస్‌ప్లే బోర్డులో ఖాళీ బెడ్‌లు ఉన్నట్లు అంకెలు చెప్తుంటాయి. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లోనూ అదే తీరులో ఉంటుంది. కానీ అక్కడి వాస్తవిక పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంటుంది. ఖాళీ బెడ్‌లు లేవని వైద్య సిబ్బంది చెప్తున్నారు. గంటల తరబడి స్ట్రెచర్ మీదనో లేక మెట్ల దగ్గరో పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రజారోగ్య శాఖ ప్రతీరోజు వెలువరించే బులెటిన్‌లలో ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్‌లతో సహా అన్ని వార్డుల్లోనూ ఖాళీగా ఉన్నాయని అధికారులు చెప్తుంటారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, గచ్చిబౌలిలోని ‘టిమ్స్‘ ఆస్పత్రి, వరంగల్‌లోని ఎంజీఎం, నిజామాబాద్‌లోని జిల్లా ఆస్పత్రి.. ఇవన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయాయి.

బెడ్ దొరుకుతుందనే గ్యారంటీ లేదు

తొలి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఆస్పత్రిలో అడ్మిషన్ దొరుకుతుందనే గ్యారంటీ లేదు. అటు ప్రభుత్వాస్పత్రుల్లో ఇటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అదే పరిస్థితి. రాజకీయ పెద్దల సిఫారసులతో ఒకవేళ వెళ్ళినా ఖాళీ బెడ్‌లు లేవన్న పేరుతో గంటల తరబడి విజిటిర్స్ రూమ్‌లో వెయిటింగ్‌లో ఉండాల్సిందే. ఏదో ఒక బెడ్ ఖాళీ అయ్యేంతవరకు ఆగాల్సిందే. లేదంటే కారిడార్‌లోనే స్ట్రెచర్ మీద ట్రీట్‌‌మెంట్ మొదలవుతుంది. ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్‌లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకునేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చినా అందులో కనిపించే అంకెలకు వాస్తవిక పరిస్థితికి పొంతన ఉండడంలేదు.

ఫార్మా హబ్‌లోనూ తప్పని తిప్పలు

సెకండ్ వేవ్‌లో పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత చాలా మందికి ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్ అవసరం కూడా చాలా పెరిగిపోయింది. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా మారడంతో రెమిడెసివిర్ ఇంజెక్షన్లు కూడా తప్పనిసరిగా మారింది. దీంతో అటు ఆక్సిజన్, ఇటు ఇంజెక్షన్లు, ఇంకోవైపు బెడ్‌లు దొరకడం గగనంగా మారింది. ఫార్మా హబ్‌గా, వ్యాక్సిన్‌ల తయారీ కేంద్రంగా, మెడికల్ డివైజెస్ సెంటర్‌గా.. ఇలా హైదరాబాద్ నగరానికి ఎన్ని రకాల గుర్తింపు ఉన్నా చివరకు రాష్ట్ర ప్రజలకు ఆపద సమయంలో బెడ్‌లు, మందులు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు దొరకడం కష్టంగా మారింది. చాలా మంది బెడ్‌ల కోసం పైరవీల బాట పట్టాల్సి వచ్చింది. అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు చెల్లించి ఆస్పత్రుల్లో బెడ్‌లను సంపాదించుకోవాల్సి వస్తోంది. ఇక ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో కొనుక్కోవాల్సి వస్తోంది.

ఆక్సిజన్‌తో సరికొత్త సమస్యలు

పాజిటివ్ బారిన పడిన పేషెంట్లలో చాలా మందికి శ్వాసకోశ సంబంధమైన సమస్యలు తలెత్తున్నాయి. ఊపిరి అందడం భారంగా మారింది. దీంతో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం కోసం ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. ట్రీట్‌‌మెంట్ తర్వాత డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సిలిండర్ ద్వారా కొన్ని రోజుల పాటు ఆక్సిజన్‌ను తీసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ ఏర్పడింది. చివరకు అది కొరతకు దారితీసింది. ఇతర రాష్ట్రాల నుంచి విమానాల ద్వారా తెప్పించుకోక తప్పడంలేదు. ఆక్సిజన్ అందని కారణంగా చాలామంది పేషెంట్లు చనిపోతున్నారు. ఆక్సిజన్ కోసమే ఆస్పత్రుల్లోని బెడ్‌లు నిండిపోతున్నాయి. మరోవైపు వైరస్ వ్యాప్తి వేగంగా, తీవ్రంగా ఉన్నందున ప్రతీరోజు కొత్తగా పాజిటివ్ పేషెంట్లు పుట్టుకొస్తున్నారు. సీరియస్ కండిషన్‌లోకి వెళ్ళిన పేషెంట్లకు ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకడం ఒక అదృష్టం లేదా సవాలుగా మారింది.

ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌లు లేకపోవడం, మార్కెట్‌లో ఆక్సిజన్ దొరకకపోవడం, రెమిడెసివిర్ ఇంజెక్షన్లకు కొరత రావడంతో కరోనా పేషెంట్ల కష్టం వర్ణించడానికి వీలు లేనంత కష్టంగా మారింది.

Next Story

Most Viewed