మద్యం అధిక ధరలకు అమ్మితే మాకు ఫిర్యాదు చేయండి: ఎస్పీ

by  |
మద్యం అధిక ధరలకు అమ్మితే మాకు ఫిర్యాదు చేయండి: ఎస్పీ
X

దిశ, నల్లగొండ: మద్యం దుకాణాదారులు సిండికేట్‌గా మారి అధిక ధరలకు విక్రయిస్తే కలెక్టరేట్, ఎక్సైజ్ శాఖల టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా, పోలీస్ శాఖ డయల్ 100, వాట్స్ అప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మద్యం ధరల పట్టిక, అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్లు కలిగిన పట్టికను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏ.వి.రంగనాధ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మద్యం అధిక ధరలకు విక్రయించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తే పిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎస్పీ ఏ.వి.రంగనాధ్ మాట్లాడుతూ మద్యం దుకాణదారులు సిండికేట్ గా మరి ప్రభుత్వం నిర్దేశించిన ధరల కన్నా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖతో పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలపై నిఘా పెట్టినట్లు చెప్పారు. మద్యం ధరల పట్టికతో పాటు అధిక ధరలకు విక్రయిస్తే పిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్లు, వాట్స్ అప్ నెంబర్లతో రూపొందించిన పోస్టర్లను అన్ని వైన్ షాపుల వద్ద ఏర్పాటు చేయనున్నామన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ ఫేస్ బుక్, ట్విట్టర్ల ద్వారా సైతం మద్యం అధిక ధరలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. మద్యం దుకాణాల లైసెన్స్ దారులు విధిగా లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, సాయంత్రం 6 గంటల కల్లా షాపులు మూసివేయాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా, అధిక ధరలకు మద్యం విక్రయించినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్, ఎక్సైజ్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed