ధాన్యం ఆరబెడుతుండగా..టోల్ ప్లాజా రేకుల షెడ్డు మీద పడి

by  |
ధాన్యం ఆరబెడుతుండగా..టోల్ ప్లాజా రేకుల షెడ్డు మీద పడి
X

దిశ, మహబూబ్ నగర్ : దంపతులిద్దరూ రైతు కుటుంబానికి చెందిన వారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకుని జీవనం సాగించాలనుకున్నారు. చేతికొచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలనుకునేలోపే అకాల వర్షాలు వారిని కష్టాల్లోకి నెట్టాయి. ధాన్యం మొత్తం తడిసి పోవడంతో అధికారులు కొనేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టి మరల అమ్మకానికి తీసుకెళ్లాలనుకున్నారు.శనివారం మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని మిడ్జిల్ మండల సమీపంలో ధాన్యం ఆరబెట్టగా అదే సమయంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ధాన్యం కొట్టుకుపోకుండా సర్దుతున్న సమయంలో గాలుల వేగానికి మున్ననూర్ టోల్‌ ప్లాజా రేకుల షెడ్డు కూలి రైతు దంపతుల మీద పడటంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం..మున్ననూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య, పుష్ప దంపతులు వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, ఓ ముసలి తల్లి వీరిపై ఆధారపడి ఉంది. కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి తడిసిపోగా, దానిని ఆరబెడుతుండగా గాలివాన బీభత్సానికి టోల్ ప్లాజా రేకుల షెడ్డు రైతులపై పడి చనిపోయారు. దీనికి నాణ్యత లేని పనులే కారణమని గ్రామస్తులు ఆరోపించారు.మృతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పరమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed