మహిళల అక్రమ రవాణ ముఠా అరెస్టు

by  |
మహిళల అక్రమ రవాణ ముఠా అరెస్టు
X

దిశ, క్రైమ్ బ్యూరో : అరబ్ దేశాలకు అమాయక మహిళలను తరలిస్తున్న మానవ అక్రమ రవాణ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ ముఠా..అరబ్ దేశాలలో ఇళ్లల్లో మేడ్ సర్వెంట్లను పంపుతున్నట్టుగా ట్రావెలింగ్ ఏజెన్సీ నడుపుతూ.. అరబ్ షేక్ లకు మహిళలను విక్రయిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన షేక్ మహమ్మద్ ఇంతియాజ్, నూనె సుబ్బమ్మ, గుండుగాల సుబ్బరాయుడు హైదరాబాద్ మలక్ పేటలోని అల్ హయత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో ఓ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. ఈ ఏజెన్సీ ద్వారా ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అరబ్ షేక్ ల నుంచి రూ.4 నుంచి 5 లక్షల వరకూ కమిషన్ పొందుతూ తప్పుడు వీసాలతో అరబ్ దేశాలకు తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మేడిపల్లికి చెందిన బాధితురాలు ఖాదర్ బీకి పాస్ పోర్టును, వీసాను సిద్దం చేసిన తర్వాత ఎయిర్ పోర్టు నుంచి విమానం ద్వారా వెళ్లే ముందు తనతో గడపాలని ముఠా సభ్యులు ఇంతియాజ్ కోరడంతో బాధితురాలు తిరస్కరించింది.

దీంతో ఆమె ఈ నెల 7న విమనాశ్రయానికి నేరుగా చేరుకుంది. అదే సమయానికి ముఠా సభ్యులు ఇంతియాజ్, సుబ్బమ్మ, సుబ్బరాయుడు, హరూన్‌లు వచ్చారు. వారు వచ్చే లోగా బాధితురాలు బోర్డింగ్ పాస్ తీసుకుని ఎయిర్ పోర్టులోకి ప్రవేశించింది. ఈ సమయంలో వారి ప్రవర్తనను అనుమానించిన బాధితురాలు వెంటనే విమానం ఎక్కకుండా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని రక్షించి, 4 గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా నిందితులు వద్ద 40 ఇండియన్ పాస్‌పోర్టులతో పాటు హైదరాబాద్ టు మస్కట్ వీసా డాక్యుమెంట్, అల్ హయత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ విజిటింగ్ కార్డులు, రూ.6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరబ్ దేశాలకు అమాయక మహిళలను తరలించే ముఠాకు సహకరించే మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.

Next Story

Most Viewed