పందుల దాడిపై హెచ్ఆర్సీలో పిటిషన్

by  |

దిశ, హైదరాబాద్ :
నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి కాలనీలో హర్షవర్ధన్ అనే బాలుడిపై పందులు దాడి చేయగా చనిపోయిన ఘటనలో జీహెచ్ఎంసీ సౌత్ జోన్ మున్సిపల్ కమిషనర్‌కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ నివాసముంటున్న కేశ్యానాయక్, చిట్టి దంపతుల కుమారుడు హర్షవర్ధన్ మంగళవారం సాయంత్రం వీధి పందులు దాడి చేయడంతో బాలుడు మరణించాడు. ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే హర్షవర్ధన్ ప్రాణాలు కోల్పోయాడని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కాలనీ వాసులు పందులు, కుక్కల గురించి అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెడ చెవిన పెట్టారని, మానవ హక్కుల కమిషన్ ఏర్పడినప్పటి నుంచి బాలల హక్కుల సంఘం వీధి కుక్కల గురించి పిటిషన్ వేసినపుడల్లా జీహెచ్ఎంసీ కుంటి సాకులు చెబుతోందని విమర్శించాడు.

బాలుడు మృతి చెందిన కారణాన బాధ్యులైన జీహెచ్ఎంసీ అధికారులపై ఐపిసి 304/ఎ కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని, వారిని వెంటనే అరెస్టు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాలుడి దహన సంస్కారాలకు వెంటనే డబ్బులు చెల్లించడంతో పాటు బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా తక్షణ ఆదేశాలు ఇవ్వాలని బాలల హక్కుల సంఘం కోరినట్టు తెలిపారు. వీధికుక్కలకు, పందులకు వెంటనే పిల్లల నియంత్రణ ఆపరేషన్లు చేపట్టాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌కు స్పందించిన హెచ్ఆర్సీ.. బాలుడు మరణించిన ఘటనపై జీహెచ్ఎంసీ సౌత్ జోన్ మున్సిపల్ కమిషనర్‌కు నోటీసులిచ్చి, ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags: Saidabad, Children rights, pig attack, boy died



Next Story

Most Viewed