ఓపెన్ మార్కెట్‌లో.. ‘ఐడెంటిటీ థెఫ్ట్’

by  |
privacy,
X

దిశ, ఫీచర్స్ : ‘డిజిటల్ విప్లవం’లో వ్యక్తిగత విషయం ఏదైనా ‘అంగడి సరుకు’గా మారిపోయింది. సామాన్యుడి అరచేతిలో డిజిటల్ వరల్డ్ ఉందనుకుంటాం కానీ, ఆ అరచేతిలోనే మన ప్రైవసీ విషయాలు లీక్ అవుతున్నాయని తెలుసుకోం. సమాజంలో మనుషులు మనల్ని ఎలాగైతే పరిశీలిస్తారో.. ఇంటర్నెట్‌లో కూడా ప్రతీ యూజర్ కదలిక రికార్డ్ అవుతుంటుంది. అభిరుచుల నుంచి అయిష్టాల వరకు అన్నీ క్యాప్చర్ అవుతుంటాయి. ఇంటర్నెట్‌తో మనం అనుసంధానమై ఉన్నందున ‘డిజిటల్ ప్రైవసీ’ అనే పదం ఇప్పుడు మరింత కీలకంగా మారింది. ప్రత్యేకించి ‘డేటా ఉల్లంఘన’లు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో ‘ఐడెంటిటీ థెఫ్ట్’ గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ డేటా డ్రైవెన్ ఏజ్‌లో.. సేకరించిన డేటాను ఎలా ఉపయోగిస్తున్నారో ఊహించడం సవాలే అయినా, వ్యక్తిగత డేటాను ఎలా భద్రపరుచుకోవాలనే విషయం గురించి ముందుగానే ఆలోచించడం ముఖ్యం.

privacy online

డిజిటల్ ప్రైవసీ విషయానికొస్తే.. వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు కంఫర్ట్ లెవల్స్ కలిగి ఉంటారు. ఒక వ్యక్తి వెబ్‌లో తన పేరు, ఇంటిపేరు, చిరునామా సహా మరెన్నో విషయాలను పంచుకునేందుకు ఇష్టపడొచ్చు. ఇంకొక వ్యక్తి అలా చేయకపోవచ్చు. ‘డిజిటల్ ప్రైవసీ’ అంటే ఇదే. పబ్లిక్ నెట్‌వర్క్స్‌లో షేర్ చేసిన వ్యక్తిగత గుర్తింపునకు సంబంధించిన సమాచారాన్ని ఇది సూచిస్తుంది. సాధారణంగా ఇండియన్స్ ఆన్‌లైన్ ఆఫర్స్‌కు అలవాటుపడిపోయారు. ఆఫర్ ఉందంటే చాలు.. అవసరం లేకపోయినా కొనేస్తారు. ఒకప్పుడు పుస్తకాలను మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకున్న భారతీయులు.. ఇప్పుడు నిత్యావసరాల నుంచి ఖరీదైన గృహోపకరణాలు, సెల్‌ఫోన్స్‌తో పాటు బంగారాన్ని కూడా డిజిటల్ అంగట్లోనే కొంటున్నారు. కానీ ఆన్‌లైన్‌లో వారి నుంచి పలు వెబ్‌సైట్స్ ఎలాంటి డేటా సేకరిస్తున్నాయో చాలా మంది వినియోగదారులకు ఇప్పటికీ అర్థంకాని విషయం.

identity theft

వెబ్‌సైట్లు వివిధ రకాల డేటాను వివిధ మార్గాల్లో ఉపయోగిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ డేటాను వినియోగదారుడు స్వచ్ఛందంగా అందిస్తే, ఇతర సమయాల్లో ఇది యూజర్‌కు తెలియకుండా, అతడి సమ్మతి లేకుండానే తీసుకుంటాయి. ఏదైనా వెబ్‌సైట్‌ను సందర్శించిన ప్రతీసారి లేదా షాపింగ్ చేస్తున్నపుడు, అదీకాకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడైనా మనం డిజిటల్ డేటాను అందిస్తున్నట్టే లెక్క. కాగా డిజిటల్ డేటాలో ముఖ్యమైంది ‘కుకీ’. ఓ వెబ్‌సైట్‌కు సదరు యూజర్ రిటర్నింగ్ కస్టమర్‌ అని గుర్తించేది అదే. అందువల్లే ఆయా సైట్స్ ప్రీవియస్ యాక్టివిటీ ఆధారంగా యూజర్ అభిరుచులు లేదా సెర్చ్ చేసిన రిలేటెడ్ ఐటెమ్స్‌‌ను ప్రొజెక్ట్ చేస్తాయి. ఇది యూజర్‌కు కొంతవరకు కన్వీనియెంట్‌గా ఉండగా, చాలా వరకు వెబ్‌సైట్‌లు హానికరం కాని వివరాలను సేకరిస్తున్నాయి. కానీ ఈ చిన్న చిన్న బిట్స్ సమాచారాన్ని కలిపితే.. వినియోగదారుడి పూర్తి డేటాను సృష్టించవచ్చు. అందువల్లే డిజిటల్ ప్రైవసీ సమస్యగా మారింది. ఇక ఇండియన్ యూజర్స్ ఎక్కువగా డిస్కౌంట్లు లేదా ఆఫర్లు లేకపోతే కొనుగోలు చేయరని తాజా సర్వే వెల్లడించగా.. ఈ విషయంలో భారతీయులు అత్యంత నిర్లక్ష్యంగా ఉన్నారని తేలింది. ఈ సర్వేలో 51% మంది భారతీయ కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్ లేదా స్పాటిఫై సబ్‌స్క్రిప్షన్ ఫీజు.. అధికారిక రేటు కంటే తక్కువ ధరకు ఈబేలో ఆఫర్ దొరికితే కొనుగోలు చేస్తామని చెప్తుండటమే అందుకు నిదర్శనం.

data breach

ఈబేలో విక్రయించే స్ట్రీమింగ్ అకౌంట్స్ అన్నీ దాదాపు దొంగిలించినవే అన్న విషయం ప్రజలకు తెలియదు. దీని అర్థం.. ఆ అకౌంట్స్ ఎలా దొంగిలిస్తారనే దానిపై ప్రజలకు అవగాహన లేదు. అనుకోకుండా వారి సిస్టమ్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ చేసి ఎవరైనా వారి ఆధారాలను దొంగిలించవచ్చు. సైబర్ క్రిమినల్స్ తమ పని ఈజీగా చేసుకునేందుకు ఆఫర్స్ పేరిట మాల్వేర్ పంపిస్తుంటారు. ముందుగా మనం ఆన్‌లైన్‌లో షేర్ చేసే ప్రైవసీ అంశాల మీద క్లారిటీ తెచ్చుకోవాలి. డేటా ప్రైవసీ బ్రీచ్ కాకుండా ఉండేందుకు ‘ప్రైవేట్ సెర్చ్ ఇంజిన్’ యూజ్ చేయాలి. ప్రైవసీ బేస్డ్ ఎక్స్‌టెన్షన్స్ వినియోగించాలి. ఐపీ అడ్రస్ దొంగిలించకుండా ఉండేందుకు వీపీఎన్ వాడాలి. ఇన్‌కాగ్నిటో లేదా ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజ్ చేయాలి. నాణ్యమైన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడంతో పాటు కుకీలను బ్లాక్ చేసే యాప్స్ లేదా సాఫ్ట్‌వేర్స్‌ను వాడాలి. ఎన్‌క్రిప్టెడ్ బ్రౌజర్ వాడటం వల్ల కూడా డేటా ప్రైవసీని కాపాడుకోవచ్చు.

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్‌ దేశాల్లో ‘ఇండియా’ ఒకటి. కానీ ‘డిజిటల్ హైజీన్ స్టాండర్డ్స్’ మెయింటైన్ చేయడంలో మాత్రం ఆ పేరును నిలబెట్టుకోలేకపోతోంది. ‘నేషనల్ ప్రైవసీ టెస్ట్‌‌లో 21 దేశాల ర్యాంకింగ్‌లో ఇండియా 19వ స్థానంలో ఉందని వీపీఎన్ ప్రొవైడర్ ‘నార్డ్‌వీపీఎన్’ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2020 నవంబర్‌‌లో నిర్వహించిన ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 48,000 మంది పాల్గొనగా, డిజిటల్ హ్యాబిట్స్, ప్రైవసీ అవేర్‌నెస్, రిస్క్ టాలరెన్స్‌ వంటి అంశాలపై ఈ సర్వే నిర్వహించారు.


Next Story

Most Viewed