ఏపీలో బెంబేలెత్తిస్తున్న వరదలు…

23

దిశ, ఏపీ బ్యూరో: బంగాళాఖాతంలో అల్ప పీడనం మంగళవారమే కాకినాడ వద్ద తీరం దాటింది. దాని ప్రభావంతో రెండుమూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంటలను వరదలు ముంచెత్తాయి. వేలాది ఎకరాల్లో నష్టం వాటిల్లింది. లోతట్టు ఇళ్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తోంది. జనజీవనం స్తంభించింది. ప్రత్యేకంగా శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా దాకా వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా వరదలకు దాదాపు పది మందిదాకా చనిపోయినట్లు సమాచారం. గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

విశాఖ జిల్లాలోని శారద, వరహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న వాగులు, గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. భారీ వర్షాలతో వంశధార నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. అధికారులు గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 46,274 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 50,308 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తాండవ రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు తాండవ రిజర్వాయర్ గేట్లను ఎత్తివేశారు.

నదీ పరివాహక ప్రాంతాలైన విశాఖ జిల్లా నాతవరం, తూర్పుగోదావరి జిల్లా అల్లిపుడి, కోట నందూరు, కుమ్మరిలోవా గ్రామాల మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని గ్రామాల్లో గడ్డలపైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కుమ్మరిలోవ సమీపంలో కట్రాళ్లకొండవద్ద రోడ్డుపైకి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలైన రెల్లికాలనీ, తారకరామానగర్, మేదరపేట ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో వంద విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. రోడ్లకు గండిపడి రాకపోకలు నిలిచిపోయాయి. చింతలపూడి మండలం, సీతానగరం వాగులో చిక్కుకుపోయిన యువకుడిని అతి కష్టం మీద స్థానికులు రక్షించారు. యలమంచిలి మండలం, కట్టుపాలెంలో గుడిసె గోడ కూలి వృద్ధురాలు నారాయణమ్మ మృతి చెందింది.

కృష్ణా జిల్లాలోని నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద ఎగువన కురుస్తున్న వర్షాలతో వైర, కట్టలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నందిగామ – వీరులపాడు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కీసర బ్రిడ్జి వద్ద మునేరు, కట్టలేరు, వైరా ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండగా, ఎగువ నుంచి లక్షా 12 వేల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదికి చేరుతోంది. దిగువున ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారని బాధితులు మండిపడుతున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉందని తెలిసి కూడా బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేయకుండా అధికారులు తాత్సారం చేశారని వరద ముంపు వాసులు ఆరోపిస్తున్నారు.

పునరావాస కేంద్రాల్లో తమకెటువంటి సౌకర్యాల్లేవంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒకేఒక్క పునరావాస కేంద్రాన్ని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటుపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షం ధాటికి ఇందిరాగాంధీ స్టేడియం మొత్తం బురదమయంగా కావడంతో బాధితుల ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉండలేక ఇళ్ల వద్దకే వెళ్లి రోడ్లపై పడిగాపులు పడుతున్నామని బాధితులు వాపోయారు. విజయవాడలోని తారకరామానగర్, భూపేష్ గుప్తా నగర్, బాలాజీనగర్‌లోకి వరద నీరు ప్రవేశంతో స్థానికులు ఇక్కట్లకు గురవుతున్నారు. తమను అధికారులు, ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.