నాడు ప్రత్యర్థి.. నేడు అనుచరునిగా మారేనా.? : TRSలో రమణ చేరికపై చర్చ

by  |
నాడు ప్రత్యర్థి.. నేడు అనుచరునిగా మారేనా.? : TRSలో రమణ చేరికపై చర్చ
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఓ పార్టీలో రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న రమణ.. టీఆర్ఎస్‌లో చేరికతో అదే స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందన్న హామీ లభించిందా.? లేక పరిస్థితుల ప్రభావంతో ఆయన పార్టీ మారేందుకు సమాయత్తం అవుతున్నారా.? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

నాడు ప్రత్యర్థులు..

జగిత్యాల ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన ఎల్ రమణ 2006 లో జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి రాష్ట్ర మంత్రి ఎమ్మెస్సార్ వేసిన సవాల్‌ను స్వీకరించిన కేసీఆర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలోనే జరిగిన ఉప ఎన్నికలో కేసీఆర్‌పై రమణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి లక్షా 70 వేల పై చిలుకు ఓట్లను సాధించారు. అప్పుడు కేసీఆర్ విజయం సాధించినప్పటికీ తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు.. జరిగిన ఎన్నికలు కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా రమణతో టీఆర్ఎస్ నాయకత్వం చర్చలు జరుపుతోంది. పసుపు కండువా వదిలేసి గులాబీ గూటికి చేరాలన్న ప్రతిపాదనను ఆయన ముందు ఉంచింది. ఇప్పటి వరకు తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రమణ చెప్తున్నప్పటికీ ఆయనకు కేబినెట్‌లో బెర్త్ ఖాయం అయిందన్న ప్రచారం కూడా మొదలైంది. అయితే 15 ఏళ్ల క్రితం ప్రత్యర్థిగా ఉన్న రమణ ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరుతాడా.? లేదా అన్నదే ప్రధాన చర్చగా సాగుతోంది. ఒకవేళ అదే నిజమైతే నాడు కేసీఆర్‌కు ప్రత్యర్థిగా ఉన్న రమణ.. నేడు అనుచరుడిగా మారనున్నారన్న డిస్కషన్ కూడా మొదలైంది.

డబుల్ బొనాంజా..

ఎల్ రమణ చేరికతో సీఎం కేసీఆర్ డబుల్ బొనాంజా కొట్టాలన్న యోచనలో ఉన్నట్టు స్పష్టం అవుతోంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం తరువాత బలహీన పడే మార్గంలో నడుస్తున్న టీడీపీ నేడు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితికి చేరింది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లో చేరడంతో శాసనసభలో టీడీపీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. పార్టీలో ఉన్న కొద్దిపాటి నాయకులను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటే.. ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని ఆశిస్తున్నారు.

అలాగే హుజురాబాద్ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్లను చూసుకుంటే రాష్ట్ర యాదవులు, పద్మశాలి, గౌడ కులాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. ఈ పరిస్థితుల్లో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన రమణను పార్టీలో చేర్పించుకుంటే బీసీ ఓట్లను టీఆర్ఎస్‌కు అనుకూలంగా మలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల అటు టీడీపీని చావు దెబ్బ కొట్టినట్టు కావడంతో పాటు హుజురాబాద్‌లో ఈటల గెలుపును శాసించవచ్చని.. ఇలా రెండు విధాలా లాభం చేకూరుతుందన్నది అధినేత మదిలో ఉన్న యోచనగా తెలుస్తోంది.

రమణ మదిలో ఏముందో..?

అయితే టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న లీకులను బట్టి అయితే ఎల్ రమణ చేరిక దాదాపుగా ఖాయం అయిపోయింది. కానీ ఆయన మనసులో ఏముందోనన్నదే ఇప్పుడు అంతుచిక్కకుండా పోయింది. టీఆర్ఎస్‌లో చేరే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రమణ చెప్తున్నారు. టీఆర్ఎస్‌లో చేరి ఉనికి లేకుండా పోయిన నాయకుల్లో తాను ఒకడిగా మిగిలిపోతే ఎలా.? అన్న అంతర్మథనంలో రమణ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి టీఆర్ఎస్‌లో అవకాశం లభించినా తరువాత మాత్రం అంతటి ప్రాధాన్యం ఉండకపోతే తాను కూడా ఉనికి లేకుండా పోయిన వారి జాబితాలో పడిపోతాను కదా.. అన్న విషయంపై తర్జనభర్జన పడుతున్నట్టుగా సమాచారం. ఈ విషయం గురించి తన సన్నిహితులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.

వారంలో జగిత్యాలకు..

ఓ వారం రోజుల్లో జగిత్యాలకు వస్తా అన్ని విషయాలు మీతో చర్చిస్తా అంటూ సోమవారం తన సన్నిహితులతో రమణ మాట్లాడినట్టు సమాచారం. రమణకు అత్యంత సన్నిహితులుగా ఉండే వారితో కూడా పార్టీ మారే విషయంపై చర్చించకపోవడంతో.. వారం రోజుల తరువాత జగిత్యాలకు వచ్చినప్పుడు మీతోనే మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు సమాచారం. రెండు మూడు రోజుల్లో అధినేత కేసీఆర్‌తో భేటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది కదా.. అని అడిగినప్పుడు అవన్ని టీఆర్ఎస్ వర్గాలు ఇస్తున్న లీకులే తప్ప నేను మాత్రం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని రమణ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed