చికెన్ ధరలకు రెక్కలు .. క్యూ కడుతున్న జనం

by  |
చికెన్ ధరలకు రెక్కలు .. క్యూ కడుతున్న జనం
X

దిశ వెబ్ డెస్క్ :
కొన్నేళ్ల కిందట బర్డ్ ఫ్లూ రావడంతో.. చాలామంది ప్రజలు చికెన్ తినేయడం మానేశారు. దాంతో అప్పుడు చికెన్ తినే వాళ్లు లేక.. చికెన్ షాపులు కోళ్ల ఫారాలు అన్ని బంద్ అయ్యాయి. ఎన్నో వేల కోళ్లను.. నేలలో పూడ్చి పెట్టారు. మళ్లీ ఇన్నాళ్లకు కరోనా వచ్చి రావడంతోనే… దాని ప్రభావం చికెన్ పై పడింది. సోషల్ మీడియాలో …
చికెన్ తింటే కరోనా వస్తుందనే వదంతులు తీవ్రంగా వ్యాప్తి చెందడంతో .. ప్రజలంతా చికెన్ తినడానికి జంకారు. దాంతో కిలో 200-250 ఉండే చికెన్ ధర అమాంతం పడిపోయింది. పది రోజుల కింద కిలో చికెన్ ధర 40 రూపాయలు ఉంది. కానీ కరోనా దెబ్బకు పడిపోయన చికెన్ రేట్లకు మళ్లీ రెక్కలొచ్చాయి. లాక్ డౌన్ మొదలైన తర్వాత చికెన్ రేటు క్రమంగా పెరుగుతోంది. వారం కిందట కిలో రూ.80 ఉన్న చికెన్​ఇప్పుడు రూ.180 పలుకుతోంది. చికెన్, కోడి గుడ్లు తింటే కరోనా రాదని ప్రభుత్వ పెద్దలు, నెక్ అసోసియేషన్ ప్రచారం చేయడంతో కొనుగోళ్లు పెరిగాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే ప్రజలు సామాజిక దూరం పాటించాలనే నియమాన్ని మరిచి గుంపులు గుంపులుగా చికెన్ షాపులు దగ్గర ఉంటున్నారు. .

సోషల్​ మీడియాలో జరిగిన ప్రచారంతో చికెన్​తోపాటు కోడి గుడ్ల ధరలు కూడా అమాంతం పడిపోయాయి. ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి మూడో వారం వరకు నెల రోజులకుపైగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ రూ.20 నుంచి రూ.40 పలికింది. దీంతో చాలా చోట్ల పౌల్ట్రీ యజమానులు ఫ్రీగా చికెన్ పంచినా ప్రజలు తీసుకోని దుస్థితి ఏర్పడింది. తమిళనాడులో అయితే.. రూపాయికే బిర్యానీ కూడా పంచారు. చికెన్ ఎవరూ తినకపోవడంతో పాటు, ఎవరూ తీసుకోకపోవడంతో కొన్ని ఏరియాల్లో కోళ్లను పూడ్చిన వీడియోలు వైరల్​ అయ్యాయి. ఒకానొక సందర్భంలో … రాష్ట్ర మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​, తలసాని, శ్రీనివాస్ లు చికెన్​ ఫెస్టివల్​ నిర్వహించి మరీ చికెన్​ తినడం ద్వారా కరోనా రాదని ప్రచారం చేశారు. అయినా చికెన్​ కొనుగోళ్లు ఆశించినంతగా పెరగలేదు. లాక్ డౌన్ మొదలైన తర్వాత సీన్ మారింది. దానికి తోడు.. చికెన్ తినడం వలన శరీరంలో శక్తి పెరుగుతుందని, కరోనాను ఎదుర్కొనడానికి కావాల్సిన అన్నీ రకాల పోషకాలు ఇందులో ఉన్నాయని స్వయంగా రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో.. చికెన్ కు డిమాండ్ పెరిగింది. అప్పటి వరకు ఎవరూ తినకపోవడంతో… పౌల్ట్రీల్లో కోళ్లను పెంచడం బాగా తగ్గించారు.. అయితే ఒక్కసారిగా వినయోగం పెరగడంతో.. సరిపడా సప్లై చేసే పరిస్థితి లేక రేట్లు పెరిగాయి. లైవ్‌‌ కోడి కిలో రూ.70 పలుకుతోంది. స్కిన్​ లెస్​ కిలో రూ.180, విత్​ స్కిన్​ రూ.160 ఉంది.

చికెన్ ముందు … కొరవడిన సామాజిక స్పృహ :

కరోనా వైరస్ చంపేస్తుంది… ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అత్యవసరం అయితే తప్ప కాలు బయట పెట్టద్దని, అది కూడా ఇంట్లో నుంచి ఒక్కరే రావాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా ప్రజలు వాటిని పెడ చెవిన పెట్టి .. బయటకు వస్తున్నారు.
గుంపులు, గుంపులుగా తిరిగితే ప్రాణాలు పోతాయని నెత్తీనోరు బాదుకుంటున్నా జనాలు వినడం లేదు. ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరిగేస్తున్నారు. పోలీసులు, అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇక ఆదివారం మరీ దారుణం. చికెన్, మటన్ షాపుల ముందు జనాలు క్యూ లైన్లు కట్టారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చికెన్, మటన్ షాపులతో పాటూ మార్కెట్లలో జనాలు భారీగా గుమిగూడారు. జనాలు భారీ క్యూ లైన్లలో కనిపించారు. వేకువజాము నుంచి ఈ రద్దీ కొనసాగింది. క్యూ లైన్ల సంగతి పక్కన పెడితే.. జనాలు సామాజిక దూరం కూడా పాటించడం లేదు.. ఒకరి వెనుక ఒకరు నిలబడ్డారు. గుంపులు, గుంపులుగా తిరుగుతున్నారు.. కొంతమంది కనీసం మాస్కులు కూడా ధరించలేదు. పోలీసులు, అధికారులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. చికెన్, మటన్ సంగతి దేవుడెరుగు ప్రాణాలు పోతాయి బాబోయ్ అంటుంటే జనాలు మాత్రం పరిస్థితిని అర్ధం చేసుకోవడం లేదు. ఇదిలానే కొనసాగితే… చికెన్, మటన్ షాపులను మూసి వేసిన తప్పు లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరింత స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags: corona virus, chicken, lock down, price, sunday, mutton



Next Story

Most Viewed