వీఐపీల కోసం ట్రాఫిక్ ఆపాలా? హైకోర్టు తీవ్ర ఆగ్రహం

by  |
వీఐపీల కోసం ట్రాఫిక్ ఆపాలా? హైకోర్టు తీవ్ర ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వీవీఐపీల పేరుతో ఉన్నతాధికారులు, ప్రముఖుల రాకపోకల సమయంలో సామాన్యుల ట్రాఫిక్‌ను ఆపేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీల కోసం సామాన్య ప్రజానీకాన్ని ఎందుకు ఆపేయాలనే ఆదేశాలు ఎవరిచ్చారని విస్మయం వ్యక్తం చేసింది. వీవీఐపీ రాకపోకలతో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నదంటూ సోమశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ నిలిపేసే అంశంపై నాలుగు వారాల్లో వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. వీవీఐపీల మూమెంట్ కోసం సామాన్యుల వాహనాలను ఎందుకు ఆపుతున్నారో, ఆ అవసరం ఎందుకొచ్చిందో కౌంటర్‌లో వివరించాలని నొక్కిచెప్పారు.

పిటిషనర్ పేర్కొన్నట్లుగా వీఐపీల కోసం చాలా రోడ్లపై సాధారణ ట్రాఫిక్‌ను నిలిపేయడం నిజమేనని, తాను స్వయంగా దీన్ని చూశానని ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడాన్ని ప్రశంసించిన చీఫ్ జస్టిస్ ఇది మంచి ఉద్దేశంతో వేసిన పిటిషన్‌గానే భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. వీవీఐపీ, వీఐపీ ప్రోటోకాల్ కేవలం ముఖ్యమంత్రి, గవర్నర్, చీఫ్ జస్టిస్‌కు మాత్రమే ఉంటుందని పిటిషనర్ ట్రాఫిక్ నిబందనల గురించి సీజే బెంచ్‌కు వివరించారు. కానీ రాష్ట్రంలో మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఈ ప్రోటోకాల్‌ను అమలుచేస్తూ సామాన్యులకు పోలీసులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని వివరించారు.
Next Story