ధరలు దిగొచ్చేనా..?

by  |
ధరలు దిగొచ్చేనా..?
X

దిశ‌, ఖ‌మ్మం: అసలే లాక్‌‌డౌన్ కాలం. దాదాపు చాలా మంది చేతిలో పని లేదు. డబ్బులూ లేవు. దీంతో నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా ముందు, వెనక ఆలోచించక తప్పడం లేదు. లాక్‌డౌన్‌‌కు ముందు ఉన్న ధరలు ప్రస్తుత ధరలతో పోల్చితే సుమారు 30 శాతం వరకు పెరిగాయి. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌పై అదుపులేక‌పోవ‌డంతో సామాన్యుల న‌డ్డీ విరుగుతోన్నది. మార్కెట్లో ధరలు పెంచి వ్యాపారులు డబ్బులు దండుకుంటున్నారు. ఎమ్మార్పీకి మించి అద‌న‌పు ధ‌ర‌ల‌కు వ‌స్తువుల క్ర‌య విక్ర‌యాలు జరుపుతున్నారు. స్టాక్ లేకపోవ‌డంతోనే ఎక్కువ ధ‌ర‌ల‌కు విక్ర‌యించాల్సి వ‌స్తోంద‌ని కిరాణా వ‌ర్త‌కులు చెబుతున్నా… వాస్త‌వంలో మాత్రం అదేం లేద‌ని తెలుస్తోన్నది. నిత్యావ‌స‌రాల కొర‌త లేద‌ని ప్ర‌భుత్వం పదేప‌దే చెబుతోన్నది. ఉప్పు నుంచి మొద‌లు ప‌ప్పు వ‌ర‌కు అన్నింటిపైనా వ‌ర్త‌కులు ధ‌ర‌లు పెంచేశారు. ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌తో నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను పొల్చి చూస్తే ప్ర‌స్తుతం మార్కెట్లో కొన్నింటి ధ‌ర‌లు సుమారు 30 శాతం పెరగడం గమనార్హం.

ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా దుకాణాల్లో అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దినసరి కూలీలకు, కార్మికులకు ఎలాంటి ఆదాయం లేకపోవడంతో పూట గడవటం కష్టమవుతోన్నది. రెండు నెల‌ల‌తో పోల్చితే ఖ‌మ్మంలో మినుపగుళ్లు కిలోపై రూ.15 నుంచి రూ.20 పెంచేశారు. ఫ్రీడమ్‌ ఆయిల్‌ లీటర్‌ ప్యాకెట్‌ ధరను రూ.90 నుంచి రూ.110కు పెంచారు. బ్రాండెడ్‌ గోధుమపిండిపై కిలోకు రూ.5, ఉప్మా రవ్వపై కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు పెంచ‌డం గ‌మ‌నార్హం. 25కిలోల బియ్యం బ‌స్తాపై దాదాపు రూ.100వ‌ర‌కు పెంచి అమ్ముతున్నారు. జనతా కర్ఫ్యూకు ముందు కిలో ఉల్లి ధర రైతు బజార్‌లో రూ.24 ఉండేది. ఇప్పుడు రూ.30 నుంచి రూ.35 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. ఇక కూరగాయాల ధరలపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అధికారుల పర్యవేక్షణ కరువు
నిబంధ‌న‌ల ప్రకారం కిరాణా దుకాణాల్లో సరుకుల ధరల పట్టికను కచ్చితంగా ఏర్పాటు చేయాలి. కానీ, ఏ దుకాణంలోనూ పట్టిక కనిపించడం లేదు. ధరలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల వ్యాపారులు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. అధికారులు తనిఖీలు చేపట్టి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed