హైకోర్టు: కాలేజీలకు స్ట్రాంగ్ వార్నింగ్, ప్రభుత్వానికి చీవాట్లు

by  |
హైకోర్టు: కాలేజీలకు స్ట్రాంగ్ వార్నింగ్, ప్రభుత్వానికి చీవాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు జూనియర్ కళాశాలలు విధిగా అగ్నిమాపక నిబంధనలను పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం రాకముందే కళాశాలలను నెలకొల్పామని, కొత్త నిబంధనలను రూపొందించిన ప్రభుత్వం హఠాత్తుగా అమలు చేయాలని చెప్పడం సరైంది కాదని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయాల్సిందేనని, కొత్త చట్టం లేదా పాత చట్టం అనే తేడాలను ఎత్తిచూపాల్సిన అవసరం లేదని, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రస్తావిస్తున్న ఈ అంశంలో హేతుబద్ధత లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించిన హైకోర్టు… ఇప్పుడే నిద్ర లేచిందా? అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలుకావడం లేదని దాఖలైన పిటిషన్‌ను గురువారం విచారించింది.

ఇంటర్‌ బోర్డు తరపున హాజరైన న్యాయవాది వాదిస్తూ నిబంధనలను పాటించని కళాశాలలను మూసివేశామని కోర్టుకు వివరించారు. 20 నారాయణ విద్యా సంస్థలు, పది శ్రీచైతన్య విద్యా సంస్థలు సహా మొత్తం నలభై ప్రైవేటు కాలేజీలను మూసివేసినట్లు లెక్కల ద్వారా వివరించారు. కళాశాలల యాజమాన్యం తరపు న్యాయవాది వాదిస్తూ కొత్త ఉత్తర్వులు రాకముందు నిర్మించిన భవనాలకు నిబంధనలు ఎలా అమలు చేస్తామని ప్రశ్నించారు. న్యాయస్థానాలు చెబితేనో లేక ఆదేశాలు జారీచేస్తేనో మాత్రమే ప్రభుత్వం నిద్ర లేస్తుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి కళాశాలలను నిర్వహించడం సహేతుకం కాదని, పాత ఉత్తర్వులను తెరపైకి తెచ్చి వాదించడంలో సహేతుకత లేదని వ్యాఖ్యానించింది. నిబంధనలకు అనుగుణంగా లేని భవనాల్లో కాలేజీలు కొనసాగించరాదని స్పష్టం చేసింది. కొన్ని కాలేజీలు కేవలం లాభాల కోసం నడుపుతున్నాయని వ్యాఖ్యానించింది. అన్నివైపుల నుంచి వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.



Next Story

Most Viewed