AP News: సీఎం జగన్‌తో అక్కినేని నాగార్జున భేటీ.. అసలు లోగుట్టు ఇదేనా?

by  |
AP News: సీఎం జగన్‌తో అక్కినేని నాగార్జున భేటీ.. అసలు లోగుట్టు ఇదేనా?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి అని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. విజయవాడకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్‌ను కలిసి చాలా రోజులు అయ్యిందని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసినట్లు వివరించారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున గురువారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి కారులో నేరుగా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అక్కినేని నాగార్జున మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలిసి భోజనం చేశారు.

ఈ భేటీలో ప్రముఖ నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డిలు కూడా ఉన్నారు. అయితే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వీరి భేటీలో ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ కు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.

చర్చలు సినీ ఇండస్ట్రీ కోసమా..?వ్యక్తిగతమా?

దివంగత సీఎం వైఎస్ఆర్ కుటుంబానికి అక్కినేని కుటుంబానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వైఎస్ఆర్ మరణం అనంతరం వైఎస్ జగన్‌తో కూడా అక్కినేని నాగార్జున స్నేహంగా మెలుగుతూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో నాగార్జున వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని ప్రచారం జరిగిన సంగతి కూడా తెలిసిందే. అనంతరం కరోనా సమయంలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై మెగాస్టార్ చిరంజీవితో కలిసి సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ పెద్దలు మరోసారి సీఎం జగన్‌తో భేటీ కావాలని నిర్ణయించారు. కానీ జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఇటీవ‌లే దిల్ రాజుతోపాటు పలువురు నిర్మాతలు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆన్ లైన్ టికెట్ల విక్ర‌యాల‌పై వారు చ‌ర్చించారు. ఇదే సమయంలో రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమ దిగివచ్చింది. పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని చెప్పుకొచ్చింది. అనంతరం మళ్లీ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలోని ప్రొడ్యూసర్ల బృందం పేర్ని నానితో భేటీ అయ్యి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏపీలో థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీకి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.

లోగుట్టు ఇదేనా?

ఇకపోతే రాష్ట్రంలో టికెట్ల విక్రయం ఆన్‌లైన్ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ టికెట్ల క్రయ విక్రయాలను ఓ ఏజెన్సీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినీనటుడు నాగార్జున నిర్మాతలతో కలిసి భేటీ అవ్వడం వెనుక ఆంతర్యం ఏంటనే దానిపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతుంది. ఆ ఏజెన్సీని చేజిక్కించుకునేందుకు నాగార్జున సీఎం జగన్‌తో భేటీ అయ్యారా అనేదానిపై చర్చ జరుగుతుంది.



Next Story

Most Viewed