ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ వేగవంతం

by  |
ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ వేగవంతం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద టూ-వీలర్ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ప్రీమియం విభాగంలో ఉనికిని పెంచుకునేందుకు హార్లే-డేవిడ్సన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. బడ్జెట్ బైక్ విభాగంలో(100-110సీసీ) అగ్రగామిగా ఉన్న హీరో మోటోకార్ప్.. మాస్, ప్రీమియం, ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగాల్లో వాహనాలను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ‘ఇంజిన్ సామర్థ్యంతో పాటు అన్ని విభాగాల్లో ప్రీమియం పోర్ట్‌ఫోలియోను తీసుకురావాలనే వ్యూహంతో కంపెనీ ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే 200సీసీ, 160 సీసీ విభాగాల్లో ఎక్స్‌పల్స్, ఎక్స్‌ట్రీమ్‌లను ప్రారంభించామనీ.. రాబోయే కొన్నేళ్లలో మరిన్ని ఉత్పత్తులను తీసుకొస్తామని హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజర్ గుప్తా చెప్పారు. హార్లే-డెవిడ్సన్ భాగస్వామ్యం కంపెనీ ప్రీమియం సెగ్మెంట్ వ్యూహాన్ని వేగవంతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో హార్లే-డెవిడ్సన్ భారత్‌లో అమ్మకాలను, తయారీ కార్యకలాపాలను నిలిపేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ చివర్లో హీరో మోటోకార్ప్, హార్లే-డెవిడ్సన్ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా హీరో మోటోకార్ప్, హార్లే-డేవిడ్సన్ బ్రాండ్ పేరుతో వివిధ రకాల ప్రీమియం మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేసి విక్రయిస్తుంది. అంతే కాకుండా హార్లే బైక్‌ల కోసం సర్వీసులు, విడిభాగాలను అందించనుంది. ఈ భాగస్వామ్యం రెండు సంస్థలకు పరస్పర ప్రయోజనకరంగా ఉంటుందనీ, ప్రీమియం విభాగంలో కొనసాగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని నిరంజర్ గుప్తా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి..ఆథర్ ఎనర్జీలో పెట్టుబడులతో పాటు, సొంతంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాలను అభివృద్ధి చేసుకోవాలని కంపెనీ భావిస్తోందన్నారు.



Next Story

Most Viewed