కొవిడ్ రోగులు ఇలా చేస్తే ‘ఆక్సిజన్‌’కు డోకా లేనట్లే..!

by  |
కొవిడ్ రోగులు ఇలా చేస్తే ‘ఆక్సిజన్‌’కు డోకా లేనట్లే..!
X

దిశ, ఫీచర్స్ : ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం, మరోవైపు చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు అయిపోతుండటం వల్ల కొవిడ్‌ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో శ్వాస‌ను మెరుగుపరుచుకోవడంతో పాటు ఆక్సిజ‌నేష‌న్ లెవెల్స్ పెంచుకునేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని సూచ‌న‌లు జారీ చేసింది. కొవిడ్ బాధితులకు ప్రోనింగ్ చేయమని స‌ల‌హా ఇచ్చింది. ముఖ్యంగా ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్ రోగులకు ‘ప్రోనింగ్’ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది. ‘ప్రోనింగ్‌’ ప్రక్రియ ద్వారా శ్వాస తీసుకోవడం సులభం కావడంతో పాటు ఆక్సిజనేషన్‌ స్థాయి మెరుగయ్యే అవకాశమున్నట్లు మెడికల్‌గా నిరూపితమైనట్టు వెల్లడించింది.

ప్రోనింగ్ అంటే :

ఉద‌ర‌భాగంపై బ‌రువు వేసి బోర్లా ప‌డుకోవ‌డ‌మే ‘ప్రోనింగ్’. ఆక్సిజనేషన్‌ను మెరుగుపరచడానికి వైద్యపరంగా ఆమోదించిన టెక్నిక్ ఇది. రక్తంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్ 94 శాతం కంటే దిగువకు ప‌డిపోయిన‌ప్పుడే ఈ ప‌ని చేయాల‌ని ఆరోగ్య శాఖ సూచించింది. ఆక్సిజన్ స్థాయి తక్కువైన వ్యక్తి ‘ప్రోనింగ్’ పొజిషన్‌లో పడుకోవడం వల్ల వెంటిలేషన్‌ మెరుగుపడటంతో పాటు అల్వియోలార్ యూనిట్లు(alveolar units) తెరుచుకుంటాయి.

ప్రాసెస్ :

ప్రోనింగ్‌ చేయడానికి మొత్తం ఐదు దిండ్లు(పిల్లో) అవసరం అవుతాయి. వీటిలో ఒకదాన్ని మెడ కింద‌, మ‌రొక‌టి లేదా రెండు ఛాతి నుంచి తొడ‌ల వ‌ర‌కు, మ‌రో రెండు మోకాళ్ల కింద పెట్టుకోవాల‌ని సూచించింది. ఇక ఎక్కువ సమయం మంచంపై పడుకునే బాధితులు రోజంతా ఒకే విధంగా కాకుండా, పలు భంగిమల్లో విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. కాగా ఒక్కో స్థానంలో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకునే వీలుంది.

వీళ్లు ప్రోనింగ్‌ చేయకూడదు :

గర్ఫిణులు, వెన్నెముక‌కు గాయ‌మైన వాళ్లతో పాటు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రోనింగ్ చేయకూడదు. ఇక భోజనం చేసిన గంట వరకు ఈ ప్రక్రియకు దూరంగా ఉండాలి. రోజులో 16 గంటల పాటు ప్రోనింగ్ చేసే వీలున్నా, సౌకర్యవంతంగా అనిపించేంతవరకు మాత్రమే చేయాలి. ఏదైనా ఒత్తిడి ఫీల్ అవుతుంటే చేయకపోవడమే మంచిది.


Next Story