ఫుల్ బాటిల్ ఇస్తవా.. స్టేషన్‌కి వస్తవా.. కానిస్టేబుల్ జులుం

by  |
Head Constable overaction
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండల పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న రమణ వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళితే… మండలంలోని అశోక్ నగర్‌కు చెందిన నరేష్ ఎడ్లబండితో ఇసుక రవాణా చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నరేష్‌ను హెడ్‌ కానిస్టేబుల్ రమణ హెచ్చరించారు. దీంతో నరేష్‌ కానిస్టేబుల్‌కు మామూళ్లు ఇవ్వడం ప్రారంభించాడు. తాజాగా.. శుక్రవారం గ్రామంలో ఇసుక రవాణా జరుగుతోందని ఓ వ్యక్తి కానిస్టేబుల్‌కు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్న రమణకు ఎవరూ దొరకలేదు. దీంతో ఆగ్రహంతో తనకు ఎప్పుడు మామూళ్లు ఇచ్చే నరేష్ ఇంటికి వెళ్లాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న నరేష్‌ను లేపి, స్టేషన్‌కు రావాలని చెప్పారు.

దానికి నరేష్ స్పందిస్తూ.. ‘‘నేను ఇసుక రవాణా చేయడం లేదు సర్. ప్రతీ సారి నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి అన్నారు.’’ దీంతో హెడ్ కానిస్టేబుల్‌ రమణకు కోపం ఆగక నరేష్‌పై దాడికి దిగాడు. బ్లెండర్స్ ప్రైడ్‌(Blenders Pride) ఫుల్ బాటిల్ పంపస్తావా? లేకపోతే స్టేషన్‌కు వస్తావా? అని హెచ్చరించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో నరేష్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన వారి ఇంటి మహిళలపై కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒకవైపు ఉన్నత స్థాయి అధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తుంటే కిందిస్థాయి సిబ్బంది మాత్రం బాధ్యతారహితంగా పోలీసు వ్యవస్థకి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.

Next Story