మంత్రి హరీష్‌ ఇలాఖాలో హరితహారం రియాక్షన్.. భగ్గుమన్న వ్యాపారులు!

by  |
siddipet-harish
X

దిశ ప్రతినిధి, మెదక్ : అభివృద్ధిలో రోల్ మోడల్‌గా నిలుస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీలో అధికారుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. మున్సిపల్ అధికారుల వేధింపులతో మున్సిపల్ శాఖలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది, వాణిజ్య, వ్యాపార సంస్థల యజమానులు, సామాన్య ప్రజలు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో అసలేం జరుగుతుందో తెలియక పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, సామాన్యులు సైతం తలలు పట్టుకుంటున్నారు. అధికారుల వేధింపులతో అసలు లాభం ఎవరికి జరుగుతుందో తెలియడం లేదు. అధికార పార్టీ నేతలు ఇవన్నీ గమనించినా తమకెందుకులే అనుకుని మౌనం పాటిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ తీరుపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మున్సిపల్‌లోని ఓ శాఖకు సంబంధించిన సిబ్బంది అంతా విధులకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ దుర్భషలాడుతూ దురుసుగా వ్యవహరిస్తున్నారని.. కలెక్టర్, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్న ఆవేదనలో ఆ సిబ్బంది ఉన్నారు. చివరకు జిల్లా మంత్రి హరీశ్ రావు వద్దకు విషయం చేరినట్టు తెలుస్తోంది. మంత్రిని కలిసి తమ గోడును వెల్లబుచ్చుకునేందుకు ఆ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. మరి మంత్రి వారికి సమయం వెచ్చించి న్యాయం చేస్తారో లేదో చూడాలి. ఇదిలాఉంటే మున్సిపల్ కార్యాలయంలో హరితహారంలో విధులు నిర్వహిస్తున్న అధికారి తీరుపై సిద్దిపేటలో విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆ అధికారి వ్యవహరిస్తున్న తీరుపై ఏకంగా హోటల్ యాజమాన్య సంఘం తమ వ్యాపారాలు స్వచ్చందంగా బంద్ చేసి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం చేరుకుని ధర్నా చేశారు. ఆ అధికారి తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారంటే ఆయన వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

వ్యాపారుల స్వచ్ఛంద బంద్.. ధర్నా..

సిద్దిపేట మున్సిపల్ హరిత హారం అధికారి ఐలయ్య తన స్థాయికి మించి వ్యవహరిస్తూ వ్యాపారులను తీవ్ర పదజాలంతో దూషించటం పట్ల కోపోద్రిక్తులైన హోటల్ యజమానులు మంగళవారం హోటల్ యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో తమ వాణిజ్య సంస్థలను బంద్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం చేరుకుని ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. హరితహారం అధికారి వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమణాచారికి వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించి కమిషనర్ విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ప్రత్యేక బలగాలు ఎందుకు..

సిద్దిపేట మున్సిపల్‌లో హరితహారం పరిరక్షణ, స్వచ్చ సర్వేక్షణ పేరిట ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం చేయాల్సిన పనులు మొక్కల పెంపకం, వాటి పరిరక్షణతో పాటు చెత్త పై చైతన్యం చేయాలి. కానీ వీరు ఓ ప్రత్యేక బలగాల దుస్తులు ధరించి కనిపిస్తున్నారు. వాహనానికి పోలీస్ సైరన్.. మిలటరీ వాహనం తలపించేలా ప్రత్యేక పోలీసు వాహనం తరహాలో బార్ లైటింగ్.. ఎవరు చూసినా అచ్చం మిలటరీ వారే అనుకోవాల్సిందే. వారి ప్రవర్తన కూడా అలాగే ఉంది. దీనికి తోడు దురుసు తనం ప్రవర్తిస్తుంటారు. వారి విధులు చెట్ల సంరక్షణ అయినా వారంతా వ్యాపార వాణిజ్య సంస్థలకు చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ల పేరిట రెచ్చిపోతారు. రోడ్డుపై చెత్త వేస్తే ఫోన్‌ల పేరిట రచ్చ రచ్చ చేస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే దురుసుగా వ్యవహరిస్తూ పోలీసులను మించి తమకు అధికారాలు ఉన్నట్లు దుర్భాషలాడుతారు.

ఎవరి మెప్పుకోసమో..

సిద్దిపేటను అందమైన.. ఆహ్లాదకరమైన పట్టణంగా తీర్చి దిద్దాలన్న సంకల్పం బాగానే ఉంది.. కానీ ఇక్కడ సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు. సిద్దిపేటను హరితహారం.. అందమైన పట్టణంగా తీర్చిదిద్దిడంలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సామాన్యులు ఇల్లు కట్టాలన్నా నిబంధనల పేరిట ఇబ్బందులు తప్పడం లేదు. తమ ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించాలంటే అక్కడ ఉన్న చెట్లు తొలగించాలంటే అనుమతులు దొరకదు. కాదని చెట్టు నరికితే హరితహారం ప్రత్యేకాధికారి ఐలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వేలల్లో ఫైన్.. మళ్లీ చీవాట్లు.. తిట్లు తప్పవు.. ఓ స్థాయిలో వేధింపులే అనాలి. ఇదిలాఉంటే గృహాలలో చెత్త పడేస్తే చర్యలు తప్పవు. అందం.. ఆహ్లాదం పేరిట జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఇబ్బందులతో పాటు వేలల్లో జరిమానాలు విధిస్తున్నారు.

మున్సిపల్ అధికారిపై చర్యలు తీసుకోవాలి :

సిద్దిపేట పట్టణ మున్సిపాలిటీలో సామల్ల ఐలయ్య అనే అధికారి తన బృందంతో వచ్చి సిద్దిపేట హోటల్స్ పైన విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తున్నారు. ముందుగా మున్సిపాలిటీలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే సూచించిన మేర కవర్లు వాడుతున్నప్పటికీ ఐలయ్య ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా హోటల్ యజమానుల పైన నోటి దురుసు తనంతో మాట్లాడుతున్నాడు. అంతే కాకుండా విచ్చలవిడిగా జరిమానాలు వేయటమే కాకుండా కొంతమంది దగ్గర డబ్బులకు ఆశ పడి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నాడు. కనీస మర్యాద లేకుండా బూతులు తిడుతున్నాడు. ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

-శ్రీనివాస్ రెడ్డి, హోటల్ యూనియన్ ప్రెసిడెంట్

డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా..

తాను ఏ హోటల్ యజమాని వద్ద డబ్బులు తీసుకోలేదని, తీసుకున్నట్టు నిరూపిస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధమని సిద్దిపేట మున్సిపాలిటీ హరితహారం ప్రత్యేకాధికారి సామల్ల ఐలయ్య అన్నారు. సిద్దిపేటలో మున్సిపల్ అధికారుల ఆగడాలు.. భగ్గుమన్న వ్యాపారులు అనే కథనాన్ని ‘దిశ’లో ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. దీనికి స్పందించిన హరితహారం ప్రత్యేకాధికారి ‘దిశ’ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధితో మాట్లాడారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తన డ్యూటీలో కాంప్రమైజ్ కానని, సిద్దిపేట ప్రజల కోసం పని చేస్తానని అన్నారు. ఏ హోటల్లో టీ తాగిన, బిర్యానీ తిన్న ప్రతిదానికీ డబ్బులు చెల్లించానని, నిబంధనలు అతిక్రమించిన హోటల్ యజమానికి జరిమానా విధించానే తప్ప ఎక్కడా కూడా వారి వద్ద డబ్బులు అడగలేదని చెప్పారు. తప్పు చేస్తే తలవంచుకుంటానని, నిక్కంగా పనిచేస్తున్న, సిద్దిపేట ప్రజల కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధమని చెప్పారు. ఇప్పటివరకు తనది 36 ఏళ్ల సర్వీస్ అని, తాను ఎవరికీ హాని కలిగించలేదన్నారు.

-హరితహారం ప్రత్యేకాధికారి సామల్ల ఐలయ్య



Next Story

Most Viewed