కాల్పుల మోతతో దద్దరిల్లిన కరీంనగర్‌.. తుపాకీ ఎక్కడిది..?

by  |
కాల్పుల మోతతో దద్దరిల్లిన కరీంనగర్‌.. తుపాకీ ఎక్కడిది..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నడి బొడ్డున తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఐదుగురు అన్నదమ్ములకు చెందిన స్థిరాస్థుల విషయంలో గత మూడు రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ వివాదం ముదరడంతో శక్రవారం రాత్రి కత్తితో పాటు తుపాకీతో దాడి చేసినట్టు కటుంబ సభ్యులు చెబుతున్నారు. కాల్పులకు పాల్పడింది అజ్గర్ కాగా మునవార్ గాయపడినట్టు పోలీసులు తెలిపారు. లక్ష్మినగర్ సమీపంలోని శాషామహల్ వద్ద జరిగిన ఈ ఘటనలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అక్కడే పార్క్ చేసి ఉన్న ఇన్నోవాలోకి చొచ్చుకెళ్లాయి బులెట్లు. సమాచారం అందుకున్న కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామని వన్ టౌన్ పోలీసులు వివరించారు.

ఆయుధం ఎక్కడిది..?

కరీంనగర్ కమాన్ చౌరస్తాకు కూత వేటు దూరంలో జరిగిన ఈ ఘటనలో ఉపయోగించిన తుపాకీ ఎక్కడిది అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లైసెన్స్ వెపన్ ఉపయోగించారా లేకా దొంగచాటుగా తీసుకొచ్చిన తుపాకీ వాడారా అన్న విషయం తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.

Next Story

Most Viewed