మరోసారి రికార్డు సృష్టించిన జీఎస్టీ ఆదాయం.. ఈ సారి ఎంతంటే ?

by  |
gst
X

దిశ, వెబ్‌డెస్క్: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) వ‌సూళ్లు ఆగష్టు నెలలో దుమ్ము రేపాయి. కొవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొని దేశ ఆర్థికవ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న సంకేతాలకు సాక్షిగా జీఎస్టీ వసూళ్లు వరుసగా రెండో నెలలో రూ. లక్ష కోట్లను సాధించాయి. సమీక్షించిన నెలలో జీఎస్టీ ద్వారా రూ. 1,12,020 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈసారి 30 శాతం అధికంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. సమీక్షించిన నెలలో మొత్తం రూ. 1,12,020 కోట్లు వసూలవగా, ఇందులో సెంట్రల్ జీఎస్టీ(సీజీఎస్టీ) వాటా రూ. 20,522 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ(ఎస్‌జీఎస్టీ) రూ. 26,605 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ) ఆదాయం రూ. 56,247 కోట్లుగా ఉన్నాయి.

ఇందులో సరుకుల దిగుమతి నుంచి రూ. 26,884 కోట్ల జీఎస్టీ ఆదాయం ఉండగా, వివిధ రంగాలపై విధించే సెస్‌ల ద్వారా రూ. 8,646 కోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగష్టులో తెలుగు రాష్ట్రాల్లోనూ జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. తెలంగాణలో ఈ ఏడాది జీఎస్టీ ద్వారా మొత్తం రూ. 3,526 కోట్లు వసూలయ్యాయి. గతేడాది నమోదైన రూ. 2,793 కోట్లతో పోలిస్తే ఈసారి 26 శాతం పెరిగాయి. ఇక, ఏపీలో గతేడాది మొత్తం రూ. 1,955 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది 33 శాతం పెరిగి రూ. 2,591 కోట్ల జీఎస్టీ కలెక్షన్లు వచ్చాయి.



Next Story

Most Viewed