కామారెడ్డి కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది..?

122
Congress

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో ముసలం నెలకొందా.. ముఖ్య నాయకులంతా ఇతర పార్టీలను నమ్ముకుంటున్నారా.. గ్రూపు రాజకీయాలతో సొంత పార్టీ నాయకులే మాజీ మంత్రికి పొగబెడుతున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఇతర పార్టీల్లో చేరేందుకు క్యూ కడుతుండడంతో జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోందనే ప్రశ్న అందరి మదిని తొలిచేస్తోంది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్​అలీ, కాంగ్రెస్ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు మధ్య గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి చేటుగా మారాయనే ఆరోపణలున్నాయి. సీనియర్ నాయకులు జిల్లా నాయకత్వంతో పొసగక పోవడంతో పార్టీ మారుతున్నారని, అలాంటి వారి భవిష్యత్​కు భరోసా కల్పించే నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ లో ఎప్పుడు ఎవరుంటారో.. ఎవరు పార్టీ వీడతారో తెలియని సందిగ్ధం నెలకొంది.

ఒక్కొక్కరుగా వీడుతున్న నాయకులు

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ తరుపున ఎల్లారెడ్డి నుంచి జాజాల సురేందర్​ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆనాడు టీఆర్ఎస్ ఆకర్ష్ కు తోడు కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్ ఉండదనుకున్నాడో ఏమోగాని గెలిచిన ఆరు నెలల్లోపే టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికిని నిలుపుకుంది. కానీ, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత బరిలో నిల్చోవడంతో మళ్లీ ఆ పార్టీ ఆకర్ష్ చేపట్టింది. దీంతో కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లకు 8 మంది గులాబీ గూటికి చేరారు. అలాగే జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా ఆ పార్టీలోకి వెళ్లారు. ముఖ్యంగా షబ్బీర్ అలీ వెంట వెన్నంటి నిలిచిన మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ లో చేరగా, పీసీసీ అధికార ప్రతినిధి ఎంజీ వేణుగోపాల్ గౌడ్ సైతం ఇటీవల బీజేపీ స్టేట్​చీఫ్​బండి సంజయ్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేడర్​కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా నిలువరించే వారు లేకుండా పోయారు.

బహిర్గతమైన గ్రూపు రాజకీయాలు

కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలను బహిర్గతం చేసింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరగగా ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు వర్గానికి సమాచారం ఇవ్వలేదు. అయితే మదన్ మోహన్ మాత్రం తన వర్గంతో భారీ బైక్ ర్యాలీతో జిల్లా కేంద్రానికి చేరుకుని సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని బలాన్ని నిరూపించుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్, గంగారాం సైతం ఆయన వెంట రావడంతో గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. కానీ, జిల్లాలో గ్రూపు రాజకీయాలకు బీజం పడింది యువజన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నాటి నుంచేనని తెలుస్తోంది.

ఈ ఎన్నికలు అభిప్రాయ సేకరణ ప్రకారం కాకుండా ఆన్​లైన్​ఓటింగ్ ద్వారా జరిగాయి. యూత్​కాంగ్రెస్ అధ్యక్షుడిగా షబ్బీర్ అలీ తనయుడు ఇలియాజ్ ను గెలిపించి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా మార్చాలని ఆయన ప్రయత్నించారు. ఆన్​లైన్​ఓటింగ్ ద్వారా మదన్ మోహన్ వర్గానికి చెందిన గజానన్ పటేల్ 45 ఓట్ల మెజారిటీతో ఇలియాజ్ పై గెలుపొందాడు. ఈ విషయం షబ్బీర్ ఆలీకి మింగుడు పడలేదు. నూతనంగా గెలిచిన గజానన్ పటేల్ సన్మాన సభ నిర్వహించగా, సుమారు మూడు వేల మందితో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఆ సమయంలో నూతన జహీరాబాద్ పార్లమెంటరీ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. సన్మాన సభలో షబ్బీర్ అలీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు వారి తరుపున నేతలెవరూ పాల్గొనలేదు.

నేడు బీజేపీలోకి మాల్యాద్రి రెడ్డి.!

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాల్యాద్రి రెడ్డి గురువారం బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇటీవల తన అనుచరగణంతో సన్నాహక సమావేశాన్ని సైతం నిర్వహించి అందరి అభిప్రాయాలను తీసుకున్న తరువాతే నిర్ణయం తీసుకున్నారు. మల్యాద్రి రెడ్డి పార్టీ వీడుతున్నా అతడిని బుజ్జగించే వారే కరువయ్యారని చెప్పవచ్చు. మల్యాద్రి రెడ్డి పార్టీ వీడినా తమ వర్గానికి నష్టం కాదని ఓ వర్గం, తమకెందుకులే అని మరో వర్గం పట్టించుకోవడం లేదని, దీంతో కాంగ్రెస్ కేడర్​అంతా పెద్ద ఎత్తున బీజేపిలోకి వెల్లడం ఖాయమైంది. జిల్లా కాంగ్రెస్ లో వరుసగా జరుగుతున్న పరిణామాలపై ముఖ్య నాయకులెవరూ నోరు మెదపడం లేదు. ముఖ్య నాయకుల పరిస్థితే పార్టీలో ఇలా ఉంటే తమ పరిస్థితి ఏంటని కిందిస్థాయి కేడర్​లో ఆందోళన నెలకొంది. ఇలా ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్​ను వీడుతున్నా మిగతా కేడర్ ను కాపాడుకోవడానికి అధినాయకత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..