పేరు మార్చుకున్న 'గ్రోఫర్స్'!

by  |
పేరు మార్చుకున్న గ్రోఫర్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నిత్యావసర సరుకుల డెలివరీ స్టార్టప్ ‘గ్రోఫర్స్’ కంపెనీ తన పేరును ‘బ్లింకిట్’గా మారుస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. కొత్త వ్యాపార నమూనాకు అనుగుణంగా ఈ స్టార్టప్ తన రీబ్రాండింగ్ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ విభాగంలో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు పేరు మార్పు దోహదపడుతుందని పేర్కొంది. జొమాటో, సాఫ్ట్‌బ్యాంక్ మద్దతున్న ఈ కంపెనీ దేశంలోని 12 నగరాల్లో వారానికి 10 లక్షల ఆర్డర్లను అందుకుంటోంది. 10 నిమిషాల్లో డెలివరీ చేసే లక్ష్యంతో పనిచేస్తున్న కంపెనీ ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి అదనంగా 150 స్టోర్లను ఏర్పాటు చేయనుంది.

గత రెండు నెలల్లో గ్రోఫర్స్ మూడున్నర రెట్ల వృద్ధిని సాధించడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ-కామర్స్ రంగంలో మరింత అభివృద్ధి ఉండనున్న నేపథ్యంలో మార్కెట్ పోటీని తట్టుకునేందుకు కొత్త నియామకాలను సైతం చేపట్టనున్నట్టు కంపెనీ పేర్కొంది. సంస్థ వేగవంతంగా కొనసాగేందుకు ఉద్యోగులుగా కాకుండా వ్యవస్థాపకుల తరహాలో ఆలోచించగల వ్యక్తులను తీసుకుంటామని, 10 నిమిషాల్లో డెలివరీ చేసే విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలిగే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కంపెనీ సీఈఓ అల్బిందర్ ధిండ్సా అన్నారు.



Next Story

Most Viewed