కరోనా.. గరీబోళ్లకు కేంద్రం రూ. 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ!

by  |
కరోనా.. గరీబోళ్లకు కేంద్రం రూ. 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ!
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న దృష్ట్యా రోజువారీ కార్మికులు, వలస కూలీలు, పేదలు, వివిధ అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ‘గరీబ్ కల్యాణ్ యోజన’ పథకం కింద ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఇలాంటి ప్యాకేజీలను ప్రకటించగా కేంద్రం భారీ స్థాయిలో ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ 21 రోజులకే పరిమితమైనా కేంద్రం మాత్రం రానున్న మూడు నెలలను దృష్టిలో పెట్టుకుని వివిధ సెక్షన్ల ప్రజలను ఆదుకోడానికి ముందుకొచ్చింది. దినసరి కూలీలు మొదలుకుని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, పేదలు, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, చిరుద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ వాటా వరకు అనేక రకాలుగా ఆర్థికంగా ఆదుకోడానికి భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఇప్పటికే వైద్య అవసరాలకు ప్రధాని రూ. 15 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించగా ఇప్పుడు పేదలకు తక్షణ సాయంగా ఉండేలా రూ. 1.70 లక్షల కోట్ల ప్యాకేజీతో కేంద్రం మరో అడుగు వేసింది.

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఆకలికి గురికాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఆహార, దైనందిన అవసరాలకు ఈ డబ్బును వినియోగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పట్టణ, గ్రామీణ, వలస అనే తేడా లేకుండా పేద కూలీ, కార్మికులందరికీ కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుందని స్పష్టం చేశారు. ఇక కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్య, పారా మెడికల్, నర్సు, పారిశుద్య కార్మికులకు తలా రూ. 50 లక్షల మేరకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే ఈ సాయం జమ అవుతుందన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ లబ్ధిదారులకు అందేలా పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ‘ఎకనమిక్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో గురువారం మీడియా సమావేశంలో వివిధ సెక్షన్లకు ప్రకటించిన వివరాలను వెల్లడించారు. ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు నిత్యావసరాలను అందించడానికి వేర్వేరు మెకానిజంలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. రానున్న మూడు నెలలను దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ మెకానిజంను రూపొందించడం విశేషం. నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలోని అంశాలు :

– కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, పారిశుద్య కార్మికులు తదితరులకు తలా రూ. 50 లక్షల వరకు బీమా సౌకర్యం. ప్రభుత్వమే వీరి తరఫున ప్రీమియంను చెల్లిస్తుంది.
– పింఛనుదార్లు, మహిళలు, దివ్యాంగులు తదితరులతో పాటు వివిధ పథకాల లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పునరావాస ప్యాకేజీకి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి.
– ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం లబ్ధిదారులకు వచ్చే నెల మొదటి వారంలోనే రానున్న సంవత్సరానికి తొలి విడతగా రూ. 2000 వారి ఖాతాల్లో జమ అవుతాయి.
– ప్రస్తుతం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీ రూ. 182గా ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకుని రూ. 20 పెంచి మొత్తం రూ. 202 చొప్పున చెల్లిస్తాం.
– జన్ ధన్ ఖాతాలు కలిగిన సుమారు 20 కోట్ల మంది మహిళలకు నెలకు రూ. 500 చొప్పున మూడు నెలల పాటు వారి ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తాం.
– ప్రస్తుతం రేషను కార్డులు కలిగినవారు ప్రతీ నెలా అందుకుంటున్న ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలకు అదనంగా ప్రభుత్వమే ఉచితంగా మరో ఐదు కిలోలు ఇస్తుంది. పప్పు కూడా ఇప్పుడు అందుకుంటున్న కిలోకు అదనంగా మరో కిలో చొప్పున మూడు నెలల పాటు అందిస్తుంది. సుమారు 80 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.
– దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 63 లక్షల స్వయం సహాయక మహిళృ బృందాలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇప్పుడు అందుకుంటున్న రూ. 10 లక్షల వరకు రుణ సౌకర్యాన్ని రెట్టింపు చేసి రూ. 20 లక్షల వరకు వీలు కల్పిస్తుంది. దీని ద్వారా సుమారు ఏడు కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతారు.
– నెలకు రూ. 15 వేల వరకు వేతనం అందుకుంటున్న సంఘటిత కార్మికులకు వారి తరఫునా, యాజమాన్యం తరఫునా ప్రభుత్వమే రెండు వాటాలను లబ్ధిదారుల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. రానున్న మూడు నెలల పాటు కేంద్రం దీన్ని అమలుచేస్తుంది. ఏదేని కంపెనలో వంద మంది కంటే తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉంటే అందులో రూ. 15 వేల వేతనాన్ని అందుకుంటున్నవారికి ఇది వర్తిస్తుంది.
– ఈపీఎఫ్‌లో జమ అయిన మొత్తంలో ఖాతాదారులు గరిష్టంగా 75% మేర ‘నాన్ రీఫండబుల్’ అడ్వాన్సును డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. లేదా మూడు నెలల వాటాను తీసుకోవచ్చు. సుమారు 4.8 కోట్ల మంది దీని ద్వారా లబ్ధి పొందుతారు.
– దేశవ్యాప్తంగా ఉన్న సుమారు మూడు కోట్ల మంది సీనియర్ సిటిజెన్లు, పేద వితంతు మహిళలు, పేద దివ్యాంగులు రూ. వెయ్యి చొప్పున ఎక్స్‌గ్రేషియా పొందడానికి అర్హులు.
– ఉజ్వల యోజన పథకం కింద సుమారు 8.3 కోట్ల మంది బీపీఎల్ కుటుంబాలు నెలకు ఒకటి చొప్పున మొత్తం మూడు వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందుకోవచ్చు.

Tags : Coronavirus In India, Coronavirus In India News, Coronavirus In India Live Updates



Next Story

Most Viewed