దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం ఎక్కువ: గవర్నర్

by  |
దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం ఎక్కువ: గవర్నర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దివ్యాంగులు ఏ విషయంలోనూ ఎవరికీ తీసిపోరు. వైకల్యాన్ని అధిగమిస్తూ వారెంచుకున్న క్రీడల్లోనూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆత్మవిశ్వాసం మన కంటే వారిలోనే ఎక్కువగా ఉంటుందని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. పారా ప్లేయర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొస్తూ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే ఉద్దేశంతో మొదలైన ఆదిత్యా మెహతా ఫౌండేషన్‌(ఏఎమ్‌ఎఫ్‌) ఇన్ఫినిటీ రైడ్‌తో మన ముందుకొచ్చింది. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) సహకారంతో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన ఇన్ఫినిటీ రైడ్‌ హైదరాబాద్‌కు చేరుకుంది. ఆఖరి దశలో భాగంగా హైదరాబాద్‌ నుంచి కన్యాకుమారి వరకు సాగే రైడ్‌ను ఆదివారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ పారా అథ్లెట్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఏఎమ్‌ఎఫ్‌ చేస్తున్న కృషిని అభినందించారు. అద్భుత ప్రతిభ దాగున్న దివ్యాంగులకు మద్దతుగా నిలువాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పారు. ఏఎమ్‌ఎఫ్‌ వ్యవస్థాపకుడు ఆదిత్యా మెహతా మాట్లాడుతూ సుదీర్ఘమైన ప్రయాణంలో మాకు ఎనలేని మద్దతు లభించిందన్నారు. పారా క్రీడాకారులకు అండగా నిలిచే మంచి ఉద్దేశంతో మొదలైన రైడ్‌లో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందని హీరోయిన్ రెజినా తెలిపారు. కార్యక్రమంలో మంచు లక్ష్మి, శిల్పా రెడ్డి, బాహుబలి సినీ నిర్మాత, ఏఎమ్ఎఫ్‌ ట్రస్టీ శోభు యార్లగడ్డ పాల్గొన్నారు.

Next Story

Most Viewed