లాక్‌డౌన్ భారమంతా ప్రజలపైనే

by  |
లాక్‌డౌన్ భారమంతా ప్రజలపైనే
X

• కరోనా పేరుతో పన్నుల పెంపు

దిశ, న్యూస్‌బ్యూరో :

కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్‌డౌన్ అమలుకావడంతో ప్రభుత్వానికి ఏర్పడిన నష్టాన్ని ఇప్పుడు ప్రజలే భరించాల్సి వచ్చింది. ఖజానాను నింపుకోడానికి పన్నుల బాదుడు మొదలైంది. కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా అన్నీ ఇదే బాటపట్టాయి. చాలా రాష్ట్రాలు మద్యం ధరలను పెంచాయి. దాని వెన్నంటే పెట్రోలు, డీజిల్ ధరలను కూడా పెంచాయి. ‘ఆదాయం లేనప్పుడు పన్నులు పెంచక తప్పదుగదా’ అని ప్రభుత్వాలు సమర్థించుకుంటుండొచ్చు గానీ.. ఆ ప్రజలకు కూడా ఆదాయ వనరులు లేనప్పుడు పన్ను భారం ఎలా మోస్తారనే ప్రశ్నకే సమాధానం లేదు. ఒకటిన్నర నెల రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగడంతో ఇప్పుడు ఖజానా నింపుకోడానికి అన్ని చోట్లా కొత్తకొత్త పన్నులు, ధరలు పెంచడం లాంటి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలన్నీ మద్యం ధరలు పెంచాయి. ఇప్పుడు తెలంగాణ కూడా అదే బాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ పన్ను పెంచడం ద్వారా సుమారు రూ. 1.76 లక్షల కోట్లను సమకూర్చుకుంటోంది.

మద్యంపై పెంచిన ధరలు కరోనా కారణంతో కొద్దికాలానికి మాత్రమే పరిమితమయ్యేవి కావు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఈ ధరలు ఇకపైన ఇలాగే ఉంటాయి. వాపస్ తీసుకునేది లేదు’ అని ఖరాఖండిగా చెప్పేశారు. లాక్‌డౌన్ కాలంలో మద్యం దుకాణాలు మూతపడటంతో ప్రభుత్వాలకు మేజర్ ఆర్థిక వనరు లేకుండాపోయింది. వ్యసనానికి అలవాటుపడినవారు కొనక తప్పుతుందా అని తిట్టుకుంటూనైనా కొనేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పాతిక వేల కోట్ల రూపాయలు మద్యం విక్రయాల ద్వారానే సమకూరుతుండగా.. ఇప్పుడు 16% పెంపుతో సుమారు రూ. 4000 కోట్ల మేర అదనంగా ఖజానాకు చేరనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా ఎమ్మార్పీపై 70% ధర పెంచింది. అయినా విక్రయాలు ఆగడంలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఒకవైపు దశలవారీ మద్యనిషేధం అంటూనే ఇటీవల తొలుత 25% ధరలు పెంచి, మూడో విడత లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత మరో 50% పెంచింది. మొత్తం 75% ధర పెరిగింది. దేశంలోనే ఇంత ఎక్కువ స్థాయిలో ధర పెంచిన ఘనత ఆంధ్రప్రదేశ్‌దే. సడలింపుల తర్వాత వైన్ షాపుల ముందు మద్యం కోసం ఎగబడిన జనాన్ని చూసిన తర్వాత అసలు మద్యనిషేధం అమలవుతోందా అనే సందేహం కలగకమానదు.

అన్ని రాష్ట్రాల ఫోకస్ మద్యంపైనే..

చాలా రాష్ట్రాల స్వీయ ఆర్థిక వనరుల్లో మద్యం రెవిన్యూదే సింహభాగం. కేంద్రానికి ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఏడాదికి సుమారు రూ. 1.76 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.51 లక్షల కోట్ల మేర సమకూరితే, ఆ తర్వాతి సంవత్సరంలో 16% వృద్ధితో రూ. 1.76 లక్షల కోట్లు సమకూరాయి. రాష్ట్రాలు కూడా మద్యంపైనే ఎక్కువ ఆధారపడుతున్నాయి. ఆంక్షల సడలింపు తర్వాత చాలా రాష్ట్రాలు మద్యం ధరలను పెంచాయి. హర్యానా ప్రభుత్వం ఐదు రూపాయల నుంచి రూ. 50 వరకు పెంచింది. తద్వారా లాక్‌డౌన్ కాలంలో నష్టపోయిన రూ. 6000 కోట్లలో కొంతైనా సమకూర్చుకోవాలనుకుంది. ఢిల్లీ ప్రభుత్వం సైతం కొత్తగా పెంచిన 70% ధరలతో రూ. 900 కోట్లు అదనంగా వస్తాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ ఏకంగా గరిష్ట స్థాయిలో రూ. 12 వేల కోట్లు వస్తుందని భావిస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం 30% మేర మద్యం ధరలను పెంచింది.

లాక్‌డౌన్ ఎత్తివేయాలని లేదా మద్యం దుకాణాలను తెరవాలని అఖిల భారత బెవరేజెస్ సంస్థల సమాఖ్య కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేసింది. ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా సగటున సుమారు 340 మిలియన్ కేసుల డిస్టిల్డ్ స్పిరిట్, 333 మిలియన్ కేసుల బీరు, 300 మిలియన్ కేసుల లిక్కర్, 2.7 మిలియన్ కేసుల వైన్ విక్రయమవుతుండగా, 40 రోజులుగా అవన్నీ ఆగిపోయాయని పేర్కొంది. కేంద్రానికి సమకూరుతున్న ఆదాయంలో కనీసంగా 12% మద్యం ద్వారానే వస్తోందని పేర్కొంది. పది రోజుల క్రితమే ఈ సమాఖ్య కేంద్రానికి విజ్ఞప్తి చేయగా.. త్వరలోనే దుకాణాలు తెరుచుకుంటాయని ఆ సమాఖ్య ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి.

మద్యం బాటలో పెట్రోలు, డీజిల్

ప్రభుత్వాలు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు రకరకాల దారులు వెతుక్కుంటాయి. అందులో భాగంగా పెట్రోలు, డీజిల్ ధరలను కూడా పెంచుతున్నాయి. అస్సాం ప్రభుత్వం గత నెలలోనే పెట్రోలు, డీజిల్ ధరలను పెంచింది. దీంతో ‘వ్యాట్’ రూపంలో ఆదాయానికి మార్గం సుగమమైంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏకంగా పెట్రోలుపై పది రూపాయలు, డీజిల్‌పై 13 రూపాయల చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. దీని ద్వారా సుమారు రూ. 1.60 లక్షల కోట్లు సమకూరనుంది. 2014 నవంబరు – 2016 జనవరి మధ్యకాలంలో తొమ్మిదిసార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. మార్చి నెలలోనూ మూడు రూపాయల చొప్పున పెంచింది. తాజాగా మరోసారి పెంచింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్రోలుపైన రెండు రూపాయలు, డీజిల్‌పైన ఒక రూపాయి చొప్పున పెంచగా.. హర్యానా ప్రభుత్వం పెట్రోలుపైన ఒక్క రూపాయి, డీజిల్ పైన రూపాయి పది పైసలు పెంచింది. తమిళనాడు ప్రభుత్వం పెట్రోలుపైన రూ. 3.25, డీజిల్‌పైన రూ. 7.61 చొప్పున పెంచి రూ. 2500 కోట్లను అదనంగా ఆర్జించనుంది.

ఇలా పెంచిన పన్నులన్నింటినీ అంతిమంగా మళ్ళీ ప్రజలే భరించాల్సి వస్తోంది. భవిష్యత్తులో స్టాంపులు రిజిస్ట్రేషన్లు, వాహన పన్ను (వెహికల్ టాక్స్), విద్యుత్ చార్జీలు, బస్ టికెట్ ధరలు తదితరాలన్నింటినీ పెంచే ఆలోచన చేస్తాయి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు ఆ దిశగా కసరత్తు చేస్తున్నాయి కూడా.

Tags: LockDown, Corona, Tax Burden, Alcohol, Liquor, Petrol, Diesel, Excise Duty

Next Story

Most Viewed