దుబ్బాకపై శీతకన్ను

by  |
దుబ్బాకపై శీతకన్ను
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ ఉప సమరంలో అభివృద్ధి, ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉన్నాయి. చేతల ప్రభుత్వం అని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. మాటలే తప్ప చేతలు లేవని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. హరీశ్‌రావు చెరువుల మంత్రి అనే గుర్తింపు పొందినా దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం శీతకన్ను ధోరణితోనే వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజల్లో ఒక సెక్షన్ అసంతృప్తితో ఉంది. అందుకు మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల అభివృద్ధే నిదర్శనమని ఉదహరిస్తున్నారు. హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిబండ చెరువు ‘మినీ టాంక్‌బండ్’గా పర్యాటకులను ఆకర్షిస్తున్నా దుబ్బాకలోని రామసముద్రం చెరువు మాత్రం ఇప్పటికీ పురోగతి దశలోనే ఎందుకు ఉండాల్సి వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏడాది కాలంలో పూర్తి చేయాలని 2016లో ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన అనుమతులు లభించినా ఇప్పటికీ పనులు సాగుతూనే ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘మిషన్ కాకతీయ’ పథకం కింద చెరువుల సుందరీకరణ అంశాన్ని కూడా చేర్చింది. అందులో భాగంగా దుబ్బాక పట్టణంలోని రామసముద్రం చెరువుకు రూ. 4.86కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టడం కోసం సాగునీటిపారుదల శాఖ నుంచి 2016 జనవరి 2వ తేదీన (జీవో నెం.9) పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. అయితే అనుకున్నట్లుగా పనులు వెంటనే ప్రారంభం కాలేదు. రెండేళ్ళ జాప్యం తర్వాత 2018జూన్‌లో సుందరీకరణ కోసం సిద్దిపేట పట్టణానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే కాంట్రాక్టరుకు సాగునీటిపారుదల శాఖ పనులు అప్పగించింది. ఆ మేరకు ఒప్పందం కూడా (నెం. 05/2018-19) జరిగింది. అప్పటి సాగునీటి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కలిసి 2018జూన్ 3వ తేదీన చెరువు సుందరీకరణ పనులకు రూ. 3కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు.

కాంట్రాక్టు సంస్థ (లక్ష్మీ వెంకటరమణ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ వర్క్స్)తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2019 జూన్ 3వ తేదీకల్లా పనులు పూర్తికావాల్సి ఉంది. కానీ 2020 అక్టోబర్ నాటికి కూడా పూర్తికాలేదు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన పరిపాలనా అనుమతుల ప్రకారం చెరువు సుందరీకరణ కోసం రూ. 4.86కోట్లు మంజూరుకాగా శంకుస్థాపన చేసే నాటికి రూ. 3 కోట్లుగా అంచనా వ్యయాన్ని సాగునీటిపారుదల శాఖ ఖరారు చేసింది. ఇప్పటివరకు రూ. 59లక్షల మేర మాత్రమే (టెండర్ పర్సంటేజీ రూ. 2.49 లక్షలతో కలిపి) పనులు జరిగినట్లు ఆ కాంట్రాక్టు సంస్థ బిల్లులు సమర్పించింది. దీనికి తోడు చిల్డ్రన్స్ పార్కు తదితర మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా ప్రభుత్వం రూ. 5కోట్ల మేర పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. సుందరీకరణ పనులే పూర్తిస్థాయి లక్ష్యం మేరకు జరగలేదు. ఇప్పటికీ చెరువులో తుమ్మచెట్లు, పిచ్చి చెట్లు, చెత్తా చెదారం పేరుకుపోయే ఉన్నాయి. అభివృద్ధి పేరుతో ప్రజలకు దగ్గరవుతున్న టీఆర్ఎస్ ప్రచారంలో ఇప్పుడు ప్రజల్లో చెరువుపైనే చర్చ జరుగుతోంది. కోమటిబండ చెరువు అందంతో రామసముద్రం చెరువు పరిస్థితిని పోల్చుకుంటున్నారు.

మిషన్ కాకతీయ రెండవ ఫేజ్‌లో రామసముద్రం చెరువు సుందరీకరణ పనులను చేర్చిన సాగునీటిపారుదల శాఖ రూ. 4.86 కోట్ల నిధులు మంజూరుకాగా రూ. 4.07 కోట్ల మేర ఖర్చు చేసినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కానీ సుందరీకరణ చెరువు పనులను చేపట్టిన కాంట్రాక్టు సంస్థ మాత్రం రూ. 59లక్షలు ఖర్చుచేసినట్లుగా బిల్లులో చూపించింది. దుబ్బాక చుట్టూ వీఐపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే ఎందుకు వెనకబడి ఉండాల్సి వచ్చిందనే ప్రజల ప్రశ్నలకు ఇప్పుడు అధికార పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. కేవలం రామసముద్రం చెరువు మాత్రమే కాకుండా పెద్దచెరువు, పోతారెడ్డిపేట-నాగారం గ్రామాల మధ్య చెక్ డ్యామ్, బోడవానికుంట అభివృద్ధి పనులు.. లాంటివన్నీ ఇప్పుడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రజల్లోని సెంటిమెంట్‌ను అస్త్రంగా వాడుకుని విపక్ష పార్టీలు ప్రచారంలో ప్రస్తావిస్తున్నాయి.

Next Story