వలస కార్మికుల గుర్తింపుపై సర్కార్ నిర్లక్ష్యం.. లెక్క తేలేది ఎప్పుడో.?

by  |
వలస కార్మికుల గుర్తింపుపై సర్కార్ నిర్లక్ష్యం.. లెక్క తేలేది ఎప్పుడో.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : వలస కార్మికులను గుర్తించడంపై సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. కార్మికులకు సంక్షేమ పథకాల అమలు కోసం నోడల్‌ అధికారిని నియమించుకుని సంబంధిత శాఖల సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి పది రోజుల్లోగా వలస కార్మికుల డేటాను సేకరించాలని అధికారులను మంత్రి మల్లారెడ్డి ఈ ఏడాది జూన్‌లో ఆదేశించారు. వలస కార్మికులకు రేషన్‌ కార్డులు, ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి ప్రయోజనాలను అందించేందుకు ఒక విధానాన్ని రూపొందించేందుకు అన్ని పరిశ్రమల వారీగా డేటాను సేకరించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి అధికారులతో నిర్వహించిన రివ్యూలో చెప్పారు.

అయినా నేటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. గడువు ముగిసినా వలస కార్మికుల లెక్క నేటికీ తేలలేదు. ఇదిలా ఉండగా గతంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 14 లక్షల మంది వలస కార్మికులు పనిచేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మంత్రి ఆదేశించి రెండు నెలలైనా అన్ని రంగాల వారీగా కలిపి గుర్తించిన కార్మికుల సంఖ్య 58,512 మందిని మాత్రమే. ఇలా అయితే వలస కార్మికుల పూర్తిస్థాయి లెక్క తేలేదెన్నడోనని పలువురు ప్రశ్నిస్తున్నారు.

పదిరోజుల్లో గుర్తించింది 12,054 మందినే..

వలస కార్మికులను గుర్తించేందుకు ప్రభుత్వం 10 రోజులు మాత్రమే అధికారులకు గడువు విధించింది. ఆ పనిని ఎంఏ యూడీ, సివిల్ సప్లయీస్, ఇండస్ట్రీస్, లేబర్, ఎన్జీవో డిపార్ట్‌మెంట్ల ద్వారా ఆయా సెక్టార్లలో పనిచేస్తున్న కార్మికులను గుర్తించాలని ఆదేశించింది. అయినా అధికారులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేశారు. పది రోజుల్లో అధికారులు గుర్తించింది కేవలం 12,054 మంది వలస కార్మికులనే గుర్తించారు. ఈ పనిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించి రెండు నెలల సమయం దాటింది. అయినా ఈ రెండు నెలల వ్యవధిలో మొత్తం 58,512 మందిని మాత్రమే సర్కార్ గుర్తించింది.

కరోనా సమయంలో పనులు లేక వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనివల్ల ఇక్కడ జీవించాలన్నా.. తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లాలన్నా ఎన్నడూలేని ఇబ్బందులను వారు ఎదుర్కొన్నారు. అయితే ఫస్ట్ వేవ్ సమయంలో వలస కార్మికులకు రూ.500, రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కానీ సెకండ్ వేవ్ సమయానికి వారిని కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. కనీసం వారికి ఎలాంటి బెనిఫిట్స్ అందించలేదు. ఇదిలా ఉండగా కేంద్రం ఈ ఏడాది మేలో మూడో విడత లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత వలస కూలీలకు ఆహర సరఫరా ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ కుటుంబానికి 5 కేజీల బియ్యం, ఒక కేజీ పప్పు ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నాటికి ప్రకటించిన 8 లక్షల కిలోల ఆహార ధాన్యాల్లో 33 శాతం మాత్రమే పంపిణీ చేయగలిగారని తేల్చింది.

రెండు నెలల వ్యవధిలో 13,184 మందిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ గుర్తించింది. ఇందులో భవన నిర్మాణ రంగానికి చెందిన వారే 9,310 మంది ఉండటం గమనార్హం. సివిల్ సప్లయిస్ శాఖ రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న 1,109 మందిని గుర్తించింది. పరిశ్రమల శాఖ మొత్తం 15,964 మంది కార్మికులను గుర్తించింది.

ఇందులో మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లోనే 12,762 మంది ఉన్నట్లు స్పష్టం చేసింది. లేబర్ శాఖ గుర్తించిన కార్మికుల సంఖ్య 27,568. ఇతర ఎన్జీవోల ద్వారా గుర్తించిన కార్మికుల సంఖ్య 687 గా ఉంది. ఇలా మొత్తంగా కలిపి రెండు నెలల్లో గుర్తించింది మాత్రం 58,512 మంది వలస కార్మికులనే. వీరి డేటాను పూర్తిస్థాయిలో సేకరించేందుకు అధికారులకు ఇంకెంత సమయం పడుతుందోననే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. ఈ నివేదిక పూర్తి చేసేదెన్నడు.. ప్రభుత్వానికి అందేదెన్నడు.. ఆ ఫలాలు కార్మికులకు వచ్చేదెన్నడో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Next Story

Most Viewed