‘ప్రభుత్వ భూములు కేసీఆర్ జాగీర్ కాదు’

by  |
‘ప్రభుత్వ భూములు కేసీఆర్ జాగీర్ కాదు’
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ప్రభుత్వ భూములు అమ్ముకోవడానికి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ జాగీరు కాదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ భూముల వేలం పాట నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బషీర్‌బాగ్ పరిశ్రమ భవన్ టీ.ఎస్.ఐ.ఐ.సీ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ శ్రేణులు ప్లకార్డులు చేతబూని, ప్రభుత్వ భూములు అమ్మొద్దని, ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని పెద్దఎత్తున నినాదాలు చేసారు. ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పాలన కొనసాగించడం కోసం ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్ముకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు.

అటు బహిరంగ మార్కెట్‌ నుంచి లక్షల కోట్ల అప్పులు, ఇటు కోట్లాది రూపాయల ప్రభుత్వ భూముల అమ్మకాలు చేస్తున్నా ప్రభుత్వ ఖజానా ఖాళీగా మారగా ప్రజా సంక్షేమం మాత్రం సున్నా అని ఎద్దేవా చేసారు. ధనిక రాష్ట్రమంటూ, బంగారు తెలంగాణ అంటూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, సీఎం కేసీఆర్ తన ఆర్థిక పాపాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు వేల‌కోట్ల రూపాయ‌ల విలువైన ప్రభుత్వం భూముల‌ను అమ్మకానికి పెట్టాడని అయన విమర్శించారు. ప్రభుత్వ భూములు ప్రజల భూములని, వాటిని ప్రజా అవసరాల కోసమో ఉపయోగించాలని, కేసీఆర్ ప్రభుత్వానికి వాటిని అమ్మే హక్కు లేదని, ప్రభుత్వ భూములను అమ్మి పాలన కొనసాగించడం సిగ్గుచేటని అన్నారు. సమైక్య పాలనలో ప్రభుత్వ భూముల అమ్మకాలను అడ్డుకొని రక్షించమని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్ముకుంటుంటే సహించేదిలేదని, పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించి రక్షించుకుంటామని చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంటే ప్రజల ఆరోగ్యం, జీవనోపాధికి రక్షణ కల్పించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం భూముల వ్యాపారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర భూములు, వనరులు ఇక్కడి ప్రజలకు ఉపయోగపడాలని, బరితెగించి అడ్డగోలుగా ప్రభుత్వ భూములను తెగనమ్ముకుంటుంటే చూస్తూ ఉరుకునేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ భూములను ప్రజావసరాలకు లేదా భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలని సయ్యిద్ అజీజ్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీ.ఎస్. బోస్ , హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టీ. నరసింహ, ఆర్. శంకర్ నాయక్, కమతం యాదగిరి, ఎస్.ఏ. మన్నన్, నిర్లేకంటి శ్రీకాంత్, తెలంగాణ ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరుపాక అనిల్ కుమార్, ఏ.ఐ.ఎస్.ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు బి.స్టాలిన్, సీపీఐ హైదరాబాద్ జిల్లా నేతలు ఆర్. మల్లేష్, సలావుద్దీన్, ఆరుట్ల రాజ్ కుమార్, షేక్ నదీమ్, షేక్ మహమూద్, సిహెచ్.జంగయ్య, గ్యార నరేష్, శ్రీమాన్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు .

Next Story

Most Viewed