షాపింగ్ మాల్స్, హోటళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ

by  |
షాపింగ్ మాల్స్, హోటళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ
X

దిశ, న్యూస్ బ్యూరో: కంటైన్‌మెంట్ జోన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనాలయాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు సోమవారం నుంచి తెరుచుకుంటుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు విధిగా మాస్కు ధరించాల్సిందేనని, స్వీయ నియంత్రణా చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూనే ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఎక్కడెక్కడ ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలో ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల రూపంలో స్పష్టం చేశారు. ఎయిర్ కండిషన్ సౌకర్యం ఉన్నచోట్ల 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్యలో టెంపరేచర్ ఉంచాలని, అంతకంటే చల్లదనం వద్దని పేర్కొన్నారు. హోటళ్లలో 50% మించి వినియోగదారులను అనుమతించవద్దని, పార్కింగ్ స్థలాల్లో సైతం అదే నిబంధన పాటించాలని స్పష్టం చేశారు.

పాటించాల్సినవి:

– ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు ఉంచాలి
– సోషల్ డిస్టెన్స్ పాటించేలాగ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి
– ప్రతి ఒక్కరూ మాస్కు లేదా ఫేస్ షీల్డ్ ధరించాలి
– ఎక్కువ మంది ఒకేచోట గుమికూడకూడదు
– ముందుజాగ్రత్త చర్యలను తెలియజేసే డిస్‌ప్లే బోర్డుల్ని పెట్టాలి
– ఫ్లోరింగ్‌ను తరచూ శుభ్రం చేయాలి. లిప్టులు, టేబుళ్లు, మరుగుదొడ్లు, హ్యాండ్ వాష్ తదితర ప్రాంతాలను వీలైనన్ని ఎక్కువసార్లు శుభ్రం చేయాలి
– ప్రతీరోజు సోడియం హైపోక్లోరైట్ రసాయనంతో ఆవరణ, లోపలి ప్రాంతాన్ని శుభ్రం చేయాలి
– ఎస్కలేటర్లు, లిఫ్టుల్లో సామర్థ్యాన్ని బట్టి సోషల్ డిస్టెన్స్ పాటించేలాగా చూడాలి. అవసరమైతే నియంత్రణ కోసం అదనపు సిబ్బందిని సమకూర్చుకోవాలి
– హోటళ్లలో దిగేవారి ఆధార్ కార్డు లాంటి వివరాలతో పాటు ట్రావెల్ హిస్టరీ, ఆరోగ్య‌స్థితి తదితరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలి. అవసరాన్ని బట్టి మాస్కులు, శానిటైజర్లను కస్టమర్లకు సరఫరా చేయాలి. రూమ్ ఖాళీ చేసిన ప్రతీసారి ఆ గది మొత్తాన్ని రసాయనాలతో శుభ్రం చేయాలి. సూట్‌కేసు, బ్యాగులు లాంటి లగేజీని కూడా శుభ్రం చేయాలి
– రెస్టారెంట్లలో హ్యాండ్ వాష్ ప్రాంతంలో టవల్‌కు బదులుగా టిష్యూ పేపర్ ఉంచాలి. వంటచేసే ప్రాంతంలో ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలి
– వీలైనంత వరకు కరెన్సీ నోట్లను నివారించే డిజిటిల్ పేమెంట్ విధానాన్ని అవలంబించాలి
– అనారోగ్యం ఉన్నవారిని లోపలికి అనుమతించరాదు. ఒకవేళ వచ్చిన తర్వాత అనారోగ్యంపాలైతే వారిని విడిగా ఒక రూమ్‌లో ఉంచాలి. డాక్టరు వచ్చి పరీక్షించేవరకు లేదా ఆసుపత్రికి తీసుకెళ్ళేంతవరకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Next Story

Most Viewed