7,714 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఔట్

by  |
7,714 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఔట్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల విషయం పక్కన పెడితే నిరుద్యోగుల జాబితాలో మరో 7వేల మంది చేరిపోయారు. వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఇంటికి పంపించారు. కొద్దిరోజులుగా ఊగిసిలాటలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలు తొలిగిపోయాయి. మొత్తం 7,714 మంది ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను శాశ్వతంగా తొలగిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ నెంబర్ 4779ను జారీ చేసింది. దాదాపు 15ఏళ్ల నుంచి పని చేస్తున్న వారిని తొలగించారు. ఉపాధి హామీ పథకంలో కీలకంగా వ్యహరించే క్షేత్ర సహాయకులు (ఫీల్డ్ అసిస్టెంట్లు) వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడింది. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో వీరిని కూడా రెగ్యులర్ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థనే రద్దు చేసింది. వీరి స్థానంలో పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. ఇకపై ఉపాధి హామీ పథకం అమలు, నిర్వహణ, మస్టర్లు, నివదికల సమర్పణ మొత్తం పంచాయతీ కార్యదర్శులకే అప్పగించారు.

15 ఏండ్లుగా పని చేస్తున్న తమను శాశ్వత ప్రాతిపదికన నియమించి, వేతనాలు పెంచాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు దిగారు. 2నెలలపాటు సమ్మె చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను గతంలోనే తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దిగి వచ్చిన క్షేత్ర సహాయకులు సమ్మెను విరమించారు. డిమాండ్లన్నీ పక్కన పెట్టి యధాతథంగా కొనసాగించాలని వేడుకున్నారు. కానీ ప్రభుత్వం కనికరించలేదు. ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రి దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నారు. సమ్మెకు దిగి తప్పు చేశామంటూ అంగీకరించి, తమ ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని బతిమిలాడారు. వీరి బాధ్యతలను గతంలోనే పంచాయతీ కార్యదర్శులకు బదలాయించారు. దాదాపు రెండు నెలల నుంచి పంచాయతీ కార్యదర్శులు ఉపాధి విధులు నిర్వర్తిస్తున్నా కొంత అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వర్తించే బాధ్యతలపై పంచాయతీ కార్యదర్శులకు మండల స్థాయిలో ఉపాధి హామీ అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు బాధ్యతలను అప్పగించింది. ముందుగా వీరికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో శిక్షణనివ్వనున్నారు. రెండు దశల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ముందుగా గ్రామీణాభవృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏపీఓలు, ఈసీలకు శిక్షణనిచ్చి ఆ తర్వాత పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి: కాంగ్రెస్

జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తోన్నఫీల్డ్ అసిస్టెంట్లను హఠాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. వారిని ఏకపక్షంగా తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో మొత్తం 7,714 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఉపాధిని కోల్పోయారని, ఆ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన 4779 నంబర్ సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed