పబ్‌జీ రీలాంచ్?.. పబ్‌జీ లవర్స్‌లో ఉత్సాహం

by  |
పబ్‌జీ రీలాంచ్?.. పబ్‌జీ లవర్స్‌లో ఉత్సాహం
X

దిశ, స్పోర్ట్స్ : ఆటలంటే మైదానంలోనే ఆడాలనే రోజులు ఎప్పుడో పోయాయి. కాలు కదపకుండా.. ఒళ్లు అలసిపోకుండా ఆడే ఇండోర్ గేమ్స్ ఎన్నో ఉన్నాయి. కానీ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత వీడియో గేమ్స్‌దే పై చేయి అయ్యింది. ఆపిల్ ఐ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్స్‌లో కొన్ని వందల రకాల వీడియో గేమ్స్ ఉన్నాయి. ప్రతీ నిత్యం కొత్త గేమ్స్ అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో అత్యంత ఆదరణ పొందిన వీడియో గేమ్ మాత్రం పబ్‌జీ. ప్రపంచవ్యాప్తంగా యువతను ఈ వీడియో గేమ్ ఎంతగానో ఆకట్టుకున్నది. ఇండియాలో కూడా పాపులర్ అయిన ఈ వీడియో గేమ్‌కు బానిసలుగా మారిపోయిన యువకులు కూడా ఉన్నారు. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్ ఇన్‌కార్పొరేషన్ ఈ గేమ్ తయారు చేసింది. అయితే ఇండియాలో మాత్రం చైనాకు చెందిన మరో కంపెనీ దీనిని మార్కెటింగ్ చేసింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో భారత ప్రభుత్వం చైనాకు చెందిన పలు యాప్‌లను నిషేధించింది. వాటిలో పబ్‌జీ కూడా ఒకటి.

వచ్చేస్తోంది..

పబ్‌జీ యాప్‌ను ఇండియాలో అనేక మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. యుద్ద రంగంలో సైనికుడిలా.. మన ఫ్రెండ్స్ మన తోటి సైనికుల్లా కలసి ఆడే ఈ గేమ్ అతి కొద్ది కాలంలోనే చాలా పాపులర్ అయ్యింది. కేవలం యువకులే కాకుండా క్రికెటర్లు, సెలెబ్రిటీలు కూడా ఈ ఆటను ఆడుతుండేవాళ్లు. కానీ పబ్‌జీ బ్యాన్ కావడంతో ఒక్కసారిగా ఈ గేమ్ లవర్స్ అందరికీ పిచ్చిపట్టినట్లు అయ్యింది. మధ్యలో ఫౌజీ పేరుతో గేమ్స్ వచ్చాయి. అంతే కాకుండా వీపీఎన్ సహాయంతో కొన్నాళ్లు ఆడినా అసలైన మజాను మాత్రం కోల్పోయారు. అప్పటి నుంచి ఇండియాలో తిరిగి ఎప్పుడు లాంచ్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ గేమ్ దక్షిణ కొరియా సంస్థదని.. చైనా కంపెనీ కేవలం మార్కెటింగ్ మాత్రమే చేసిందని పేర్కొంటూ క్రాఫ్టన్ ఇన్‌కార్పొరేషన్ భారత ప్రభుత్వానికి వివరించింది. ఈ గేమ్‌తో చైనాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా క్రాఫ్టన్ కంపెనీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పబ్‌జీ ప్లేయర్స్‌లో సుపరిచితులైన లవ్ శర్మ అలియాస్ గాడ్ నిక్సన్, టీఎస్ఎం ఘాతక్ పెట్టిన పోస్టులు వైరల్‌గా మారాయి. పబ్‌జీ రీలాంచ్‌కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. రేపోమాపో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయిని వాళ్లు తమ సామాజిక వేదికల్లో పేర్కొన్నారు. దీంతో పబ్‌జీ అభిమానులు పట్టరాని ఆనందంతో నిండిపోయారు.

కొన్నాళ్లుగా చర్చలు..

పబ్‌జీ మొబైల్‌ను తిరిగి ఇండియాలో లాంచ్ చేయడానికి మాతృసంస్థ గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వం, డీవోటీ, ఐటీ శాఖలతో చర్చలు జురుపుతున్నది. క్రాఫ్టన్ ఇన్‌కార్పొరేషన్ ప్రతినిధులు పలు దఫాలుగా అవసరమైన అనుమతుల కోసం సంప్రదింపులు జరిపారు. ఈ విషయంపై క్రాఫ్టన్ సంస్థ కార్పొరేట్ డెవలెప్‌మెంట్ హెడ్ షాన్ హ్యూనిల్ స్పష్టతను ఇచ్చారు. ‘భారత వీడియో గేమింగ్ మార్కెట్ గురించి మాకు తెలుసు. గత కొన్ని వారాలుగా మా ప్రొడక్ట్ తిరిగి లాంచ్ చేయడానికి అన్ని రకాల అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. సరైన సమయాన్ని మేం చెప్పలేకపోయినా.. ఇండియాలో మాత్రం తిరిగి అడుగుపెడతామని మాత్రం చెప్పగలను. పబ్‌జీ లవర్స్ కల సాకారం కావడానికి మేం కృషి చేస్తున్నాము’ అని ఆయన చెప్పారు. ఇండియా కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన పబ్‌జీ యాప్‌ను లాంచ్ చేయడానికి క్రాఫ్టన్ కంపెనీ సిద్దంగా ఉన్నది. అయితే దీనికి సంబంధించిన ప్రీ-రిజిస్ట్రేషన్లు మాత్రం ప్రారంభించకూడదని క్రాఫ్టన్ ఇన్‌కార్పొరేషన్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.


Next Story