సంస్కరణలను వేగవంతం చేయాలి: గీతా గోపీనాథ్

by  |
సంస్కరణలను వేగవంతం చేయాలి: గీతా గోపీనాథ్
X

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా వల్ల భారత ఆర్థికవ్యవస్థ 2020 సంవత్సరానికి 4.5 శాతం ప్రతికూలత ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోవడంతో ప్రస్తుత ఏడాది తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. 1961 తర్వాత ఇదే అత్యంత తక్కువ వృద్ధిరేటు అని పేర్కొన్నారు. ఇది ఏప్రిల్ నెలతో పోలిస్తే 1.9 శాతం తక్కువని వ్యాఖ్యానించారు. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీకి ఎలాంటి సలహాలు ఇస్తారని అడగగా… భారత్ కరోనా టెస్టుల సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, కరోనాతో దెబ్బతిన్నవారికి లేదా ఎంఎస్ఎంఈలకు ప్రత్యక్ష, ఇతర మార్గాలలో మరింత సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. అలాగే, మరిన్ని సంస్కరణలకు ఇది మంచి అవకాశమని తెలిపారు.

2020లో తొలిసారి అన్ని దేశాలు ప్రతికూల మార్గంలో నడిచే అవకాశముందని గీతా గోపినాథ్ భావించారు. చైనాలో ఏప్రిల్ నెలలో తిరిగి ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యాయని, కొత్తగా నమోదయ్యే కేసులు తక్కువగా ఉన్నాయని, ఈ క్రమంలో 2020 సానుకూల వృద్ధి నమోదు చేసే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో చైనా వృద్ధిరేటు 1.2 శాతం అంచనా వేయగా, దానిని 1 శాతానికే కుదించినట్లు తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ పాత్ర కీలకమైనది కావున భారీ సంస్కరణలు అవసరమని, డిజిటల్ విభాగంలో భారత్ చాలా బాగా రాణించింది. ఇదే తరహాలో వైద్యరంగంలో కూడా రాణించాలని, సంస్కరణలను వేగవంతం చేయడం కచ్చితంగా దేశానికి సహాయపడుతుందని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed