స్క్రాప్‌లో ఆదాయం వెతుక్కుంటోన్న జీహెచ్ఎంసీ

by  |
స్క్రాప్‌లో ఆదాయం వెతుక్కుంటోన్న జీహెచ్ఎంసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆదాయం వచ్చేందుకు ఉన్న అన్ని మార్గాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వదులుకోవడం లేదు. రెగ్యులర్ పన్నులు, ఇతర ఆదాయ మార్గాలతో పాటు జరిమానాల రూపంలోనూ బల్దియాకు ఆదాయం సమకూరుతోంది. బల్దియా పరిధిలో అనుమతి లేకుండా, అక్రమంగా, నిబంధనలను ఉల్లంఘించి ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం తొలగించింది. సంబంధిత యజమానులకు జరిమానాలు కూడా విధిస్తూ వస్తున్నారు. ఈ రకంగా పోగైన హోర్డింగ్‌ల స్క్రాప్‌ను వేలం వేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది.

జీహెచ్ఎంసీ పరిధిలో రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న సంస్థలు, వ్యక్తుల అక్రమ హోర్డింగ్‌లను ఈవీడీఎం పట్టించుకోదనే విమర్శలు కొనసాగుతుంటాయి. అయితే పబ్లిక్ ఆస్తుల రక్షణ చట్టం అమలుకు తాము కచ్చితంగా పనిచేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. బల్దియా పరిధిలో హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేయడంలో పాటించాల్సిన నిబంధనలు గతంలోనే రూపొందించారు. తద్వారా పబ్లిక్ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా నివారించాలన్నది ఉద్దేశం. అయితే ఏండ్లు గడిచినా అక్రమ హోర్డింగ్స్ కొత్తగా వస్తూనే ఉండటం ఏ మాత్రం తగ్గలేదు. వీటిని నివారించేందుకు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం గ్రేటర్‌లో అక్రమంగా, నిబంధనలు ఉల్లంఘించిన హోర్డింగ్‌లను తొలగించడంతో పాటు సంబంధిత యజమానులకు జరిమానాలు విధిస్తూ వస్తోంది. మొదటిసారిగా 2018లో నగరంలో 333 అనధికార హోర్డింగ్‌లను గుర్తించి అదే ఏడాది అనధికార హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. సుమారు 20 వేల వరకూ అక్రమ హోర్డింగ్‌లను తొలగించగా.. వీటిల్లో 2 వేల వరకూ హోర్డింగ్‌లు నిబంధనలకు లోబడి ఏర్పాటు చేయలేదని జీహెచ్ఎంసీ గుర్తించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఏక కాలంలో 50 వేలకు పైగా హోర్డింగ్‌లను కొన్ని వారాల సమయంలో బల్దియా సిబ్బంది తొలగించారు. ఈ స్క్రాప్ అంతా బేగంపేటలోని ఓ గోడౌన్‌లో నిల్వ చేస్తున్నారు. .అక్రమ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బ్యానర్లపై 2018 మార్చి 31 నుంచి 2020 సెప్టెంబర్ 19 వరకు రూ.4.61 కోట్లు జరిమానాలు విధించినట్టు జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.

వేలానికి హోర్డింగ్ స్క్రాప్..

నగరంలో ఇప్పటివరకూ తొలగించిన హోర్డింగ్, ఫ్లెక్సీల స్ర్కాప్‌నంతా కలిపి వేలం వేయాలని జీహెచ్ఎంసీ అడ్వర్టయిజ్‌మెంట్ విభాగం నిర్ణయించింది. అయితే గోడౌన్‌లో ఉన్న స్క్రాప్ ఎంత బరువు ఉంటుందో, ఎంత విలువ చేస్తుందనేది బల్దియా లెక్కించలేదు. ఈ స్క్రాప్‌ను తీసుకెళ్లేందుకు ఆసక్తి గల ఏజెన్సీల నుంచి బిడ్డింగ్‌లను ఆహ్వానించనున్నారు. టెండర్‌లో పాల్గొనేందుకు రూ.2.5 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ బిడ్డర్ స్క్రాప్‌ను పర్సనల్‌గా పరిశీలించి అంచనా వేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని, అయితే కిలోకు ఎక్కవ ధరను కోట్ చేసిన ఏజెన్సీకే పనులు అప్పగిస్తామని అడ్వర్టయిజ్‌మెంట్ విభాగం తెలిపింది. పనులు దక్కించుకున్న ఏజెన్సీ వర్క్ ఆర్డర్ పొందిన మూడు నెలల్లోపూ స్క్రాప్ మొత్తాన్ని గోడౌన్ నుంచి తొలగించాల్సి ఉంటుంది.

Next Story