ముందే చెప్పిన ‘దిశ‌’.. కాంగ్రెస్‌లోకి గండ్ర సత్యనారాయణ

by  |
ముందే చెప్పిన ‘దిశ‌’.. కాంగ్రెస్‌లోకి గండ్ర సత్యనారాయణ
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : భూపాల‌ప‌ల్లి రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత అయిన గండ్ర స‌త్యనారాయ‌ణ కాంగ్రెస్‌లో చేరిపోవ‌డం ఖాయ‌మైంది. మంగ‌ళ‌వారం పీసీసీ చీఫ్‌ను క‌లిసిన అనంత‌రం గండ్ర స‌త్యనారాయ‌ణ స్వయంగా మీడియాకు వెల్లడించారు. స‌త్యనారాయ‌ణ కాంగ్రెస్‌లోకి వెళ్తున్న విష‌యంపై ‘దిశ’ ప‌త్రిక ముందే క‌థ‌నం ప్రచురించింది. రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష ప‌ద‌వి ఖాయం కావ‌డంతో ఆయ‌న కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు ‘దిశ’కు అత్యంత‌ విశ్వస‌నీయులు వెల్లడించారు.

ఈ మేర‌కు గ‌త నెల 28న ‘దిశ’ ప‌త్రిక‌లో క‌థ‌నం ప్రచురిత‌మైన విష‌యం పాఠ‌కుల‌కు విదిత‌మే. గండ్ర స‌త్యనారాయ‌ణ చేరిక‌తో భూపాల‌ప‌ల్లి జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం స్పష్టంగా క‌నిపిస్తున్నది. గండ్ర స‌త్యనారాయ‌ణ చేరిక‌తో కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం అవ‌డ‌మే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజా స‌మ‌స్యల‌పై పోరాటం ఉంటుంద‌ని ఆయ‌న అనుచ‌రులు పేర్కొంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన‌ గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి ఆ త‌ర్వాత జ‌రిగిన‌ రాజకీయ ప‌రిణామాల‌తో గూలాబీ గూటికి చేరుకున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి మూడో స్థానంలో నిల‌వ‌గా, ఏఐఎఫ్‌బీ నుంచి పోటీ చేసిన గండ్ర స‌త్యనారాయ‌ణ రెండో స్థానంలో నిలిచారు. ఎలాగైనా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా గెల‌వాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న గండ్ర స‌త్యనారాయ‌ణకు కాంగ్రెస్‌లో చేరిక బాగా లాభిస్తుంద‌ని ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. త్వర‌లోనే భూపాల‌ప‌ల్లి జిల్లా కేంద్రంలో భారీ బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని, ఆ బ‌హిరంగ స‌భ‌లోనే స‌త్యనారాయ‌ణ చేరిక ఉంటుంద‌ని ఆయ‌న స‌న్నిహితులు పేర్కొంటున్నారు.

gandra satyanarayana



Next Story

Most Viewed