రైతుల గోస పట్టదా.. సర్కారు తీరుపై గండ్ర సత్యనారాయణ ఫైర్

by  |
రైతుల గోస పట్టదా.. సర్కారు తీరుపై గండ్ర సత్యనారాయణ ఫైర్
X

దిశ, శాయంపేట : శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నాయకులు గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని, పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల నడ్డివిరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాల తీరును చూస్తే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రతిపక్షాలు, అధికారంలో లేని రాజకీయ పార్టీలు, నిరుద్యోగ యువకులు, రైతులు రొడ్డెక్కి మా సమస్యలు పరిష్కరించండి అంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. కానీ, అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వడ్లు మీరు కొనాలి అంటే మీరు కొనాలి అంటూ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.

అంతేకాకుండా అధికారంలో ఉన్న వాళ్లే.. ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అని నినాదాలు చేయడం వింతగా ఉందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు.. రైతులకు మేము మేలు చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటూనే వడ్ల కొనుగోలులో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లతో నిర్మాణం చేశామని చెప్పుకుంటున్నది. మిషన్ కాకతీయతో చెరువులను నీటితో నింపామని గొప్పలు చెప్పుకుంటూ.. వరి పంటను ఎందుకు వద్దూ అంటున్నారో రైతులకు చెప్పాలని ప్రశ్నించారు. ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని అడిగారు. సర్కార్ నాలుగు లక్షల కోట్ల అప్పు చేసింది. ఆ నాలుగు లక్షల కోట్లను రైతుల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed