రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ చర్చలు!

by  |
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ చర్చలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద రిటైల్ మార్కెట్ బిగ్‌బజార్‌ను నిర్వహిస్తున్న ఫ్యూచర్ రిటైల్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ వాటాలను కొనుగోలు చేస్తున్నారనే విషయం మార్కెట్లో చక్కర్లు కొడుతోంది. ఫ్యూచర్ రిటైల్ కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీకి చెందినది. ఈ గ్రూప్, బిగ్‌బజార్ హైపర్ మార్కెట్లనే కాకుండా, గ్రాసరీ సరఫరా చేసే ఈజీ డే క్లబ్‌ను నిర్వహిస్తోంది. లిక్విడిటీ ఒత్తిళ్లతో కిశోర్ బియానీ గ్రూ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ గత వారం అమెరికా డాలర్ బాండ్లపై వడ్డీ చెల్లింపులు చేయలేకపోయినట్టు సమాచారం.

ఈ కంపెనీలోని ప్రమోటర్లకు 42 శాతం వాటా ఉండగా, జూన్ చివరి నాటికి ఫ్యూచర్ రిటైల్ ప్రమోటర్లు తమ మొత్తం వాటాలో 75 శాతం వరకు విక్రయించడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే, విక్రయానికి ఉంచిన వాటాలను ముఖేశ్ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అమ్మేందుకు చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, దేశీయ ఈక్విటీ మార్కెట్లో సైతం ఫ్యూచర్ రిటైల్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా కొనుగోలుపై అంచనాలు భారీగా పెరిగాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాటాలను విక్రయించిన అనంతరం మిగ్లిన గ్రూప్‌లోని ఎఫ్ఎంసీజీ వ్యాపారంతో పాటు ఇతర విభాగాలను కిశోర్ బియానీ నిర్వహించనున్నారు.

కాగా, ఈ వాటా విక్రయం గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించారు. ఫ్యూచర్ రిటైల్ భారత్‌లో 1,500 కి పైగా స్టోర్‌లను నిర్వహిస్తోంది. బడ్జెట్ స్టోర్‌, కిరాణా విభాగం బిగ్ బజార్‌తో సహా పలు సూపర్ మార్కెట్ బ్రాండ్లను కలిగి ఉంది.


Next Story