మంత్రి కేటీఆర్ ఇలాఖాలో విచిత్రం.. సామాన్యుడి ఇంటి ముందు భారీగా పోలీసు పహారా..?

by  |
మంత్రి కేటీఆర్ ఇలాఖాలో విచిత్రం.. సామాన్యుడి ఇంటి ముందు భారీగా పోలీసు పహారా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హైదరాబాద్ – సిరిసిల్ల ప్రధాన రహదారి… తెల్ల వారుజామున 4 గంటల సమయం.. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామ ప్రధాన రహదారిపై పోలీసు వాహనాలు రయ్ రయ్ మంటూ తిరుగుతున్నాయి. కోడి కూత కంటే ముందే మరిన్ని పోలీసు వాహనాలు హారన్ల మోతతో ఓ ఇంటి ముందు వచ్చి ఆగాయి. ఆ ఇంటి సమీపంలో ఖాకీల బూట్ల చప్పుళ్లు, పరిసరాల్లో పహారా కాస్తున్న బలగాలు. అప్పుడే గ్రామానికి చెందిన జనం రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ ఇదంతా గమనిస్తున్నారు. ప్రముఖులెవరో సిరిసిల్లకు వస్తున్నారని ఆ గ్రామస్తులు గుసగుసలాడుకుంటున్నారు. నిత్యకృత్యంగా మారిన ఈ తంతు సిరిసిల్ల జిల్లా వాసులకైతే అత్యంత సాధారణ విషయంగా మారినప్పటికీ బాహ్య ప్రపంచానికి మాత్రం చోద్యమనే చెప్పాలి.

ఇంతకీ ఏం జరుగుతోందంటే..?

అన్నల ఉనికి అసలే లేకున్నా, సాయుధ విప్లవ కారుల సంచారమే లేకున్నా అక్కడ పోలీసులు గస్తీ చేస్తూ కుస్తీ పడాల్సి రావడానికి కారణాలు ఏంటీ..? ఆ సామాన్యుని వెనక ఉన్న అసలు కథేంటో తెలిస్తే విస్తూపోవడం మీ వంతే. సిరిసిల్ల జిల్లా నేరేళ్లలో 2017 జులైన జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇందుకు మూల కారణమని చెప్పాలి. గ్రామం మీదుగా వెలుతున్న ఇసుక లారీ ఢీ కొనడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. అప్పటికే గ్రామానికి చెందిన పలువురు ఇసుక లారీల కింద పడి చనిపోడమో లేక గాయాలపాలు కావడం జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇసుక లారీలను తగులబెట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

మరునాడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మృతదేహంతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ తరువాత పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇందుకు బాధ్యులుగా పేర్కొంటూ కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ క్రమంలో తమ వాళ్లను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియలేదంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసి న్యాయం చేయాలంటూ బీజేపీ నేత బండి సంజయ్‌ని, మీడియా ప్రతినిధులను కలిసి విన్నవించుకున్నారు. ఈ విషయంలో ఆందోళనలు చేసేందుకు బండి సంజయ్ కసరత్తులు చేస్తున్న క్రమంలో పోలీసుల అదుపులో ఉన్నవారిని అరెస్ట్ చేసి జిల్లా జైలుకు తరలించారు. వారంతా ఆరోగ్యంతో ఉన్నట్టు డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ పైన కనబడుతున్న గాయాలను గమనించిన జైలు అధికారులు మెడికల్ చెకప్‌కు మళ్లీ పంపించారు.

అంతే అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం అంతా రాష్ట్రమంతా గుప్పుమంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిరిసిల్ల పోలీసుల తీరుపై మండిపడుతూ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది మందికి చికిత్స చేయించేందుకు ప్రత్యేకంగా ఆసుపత్రులకు తరలించారు. చివరకు లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్ కూడా సిరిసిల్ల సందర్శించారంటే ఈ ఘటన ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. బాధితుల గురించి వెలుగులోకి వచ్చిన తరువాత అటు ఆందోళనలు చేస్తూనే బాధితుల్లో దళితులు కూడా ఉన్న విషయాన్ని తెలుసుకుని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ కమిషన్ సభ్యుడు రాములు కూడా క్షేత్ర స్థాయిలో విచారణ జరిపారు. అయితే, చివరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు రంగంలోకి దిగి ఆరుగురికి పరిహారం అందించారు. కానీ వారిలో ఇద్దరు మాత్రం నేటికీ కాంప్రమైజ్ కావడం లేదు. అందులో కోల హరీష్ అయితే ససేమిరా అంటున్నారు.

హరీష్ ఇంటి వద్దే పహారా…

పోలీసు అధికారి కావాలని కలలు కన్న కోల హరీష్ అనుహ్యంగా పోలీసులు పెట్టిన కేసుల్లో ఇరిక్కుపోయాడు. దీంతో అతని భవిష్యత్తు అంతా అంధకారం అయిపోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని, సిరిసిల్ల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేటీఆర్ తమకు ఇచ్చిన మాట తప్పాడంటూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. 2017 సెప్టెంబర్ నుంచి తన పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాడు. దీంతో అప్పటి నుండి పోలీసులు సిరిసిల్లకు ఎప్పుడు వీఐపీలు వచ్చినా ఇతని ఇంటి ముందు గస్తీ మాత్రం నిర్వహించక తప్పని పరిస్థితి తయారైంది. మంత్రి కేటీఆర్ టూర్ ఉన్నా, ముఖ్యమంత్రి కేసీఅర్ పర్యటనే అయినా, ఇతర మంత్రులు ఎవరు వచ్చినా కోల హరీష్ ఇంటి వద్ద పోలీసు పహారా సర్వసాధారణం అయిపోయింది. తన ఇంటి చుట్టూ చేరిన పోలీసులతో హరీష్ వాగ్వాదానికి దిగడం వీఐపీల పర్యటన అయిపోయిన తరువాత పోలీసులు తిరిగి వెళ్లిపోవడం అదో ఆనవాయితీగా మారింది. వీఐపీలు వెళ్లిపోయే వరకూ అంటే 13 నుండి 16 గంటల వరకు కోల హరీష్ తో పాటు అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి కస్టడిలోని ఉండిపోవాల్సి వస్తోంది. దాదాపు ఐదేళ్లుగా సాగుతున్న ఈ తంతు అటు పోలీసులకు, ఇటు కోల హరీష్, అతని కుటుంబ సభ్యులకు సర్వ సాధారణమే అయినప్పటికీ ఓ సామాన్యునికి అసామాన్యమైన భద్రత కల్పించడమే ఇక్కడ విచిత్రంగా మారింది.

భద్రత ఎంతో తెలుసా..?

కోల హరీష్ ఇంటి వద్ద ప్రముఖుల పర్యటన సందర్భంగా డ్యూటీ చేసే పోలీసు అధికారుల వివరాలు తెలిస్తే ముక్కున వేలేసుకోక మానరు. ఓ డీఎస్పీ స్థాయి అధికారితో పాటు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఇతని ఇంటి వద్ద మోహరిస్తారు. ఒక్కోసారి రెండు ప్రత్యేక వాహనాల్లో కూడా బలగాలు నేరెళ్ల గ్రామంలోని కోల హరీష్ ఇంటి ముందు డ్యూటీలో ఉంటారు. కనీసం 50 నుండి వంద మంది పోలీసులు ఈ ఇంటి పరిసరాల్లో విధులు
నిర్వర్తిస్తుంటారు.

పోలీసులకూ సమస్యే..

అయితే, సిరిసిల్ల జిల్లా పోలీసు అధికారులకు కూడా కోల హరీష్ ఇంటి ముందు ప్రత్యేకంగా పహారా కాసేందుకు వెల్లడం ఇబ్బందిగానే మారిందని చెప్పకతప్పదు. క్రమశిక్షణకు మారు పేరైన పోలీసు శాఖలో పని చేస్తున్నందున వారు బయటకు చెప్పుకోలేకపోయినా ప్రాక్టికల్‌గా పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. ఒక్కో సారి కోల హరీష్ కుటుంబ సభ్యులు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికారంలో ఉన్న సర్కారు పెద్దల పర్యటనలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి పోలీసులకు ఎదురవుతున్నది. కానీ, డిసిప్లేనరీ డిపార్ట్ మెంట్లో పనిచేస్తున్నందున వారు మాత్రం డ్యూటీపైనే దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్నారు.


Next Story