పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

by  |
పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
X

దిశ, దుమ్ముగూడెం: ఏఎస్పీ వినీత్.జి ఐపీఎస్ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రవి కుమార్, పోలీసు సిబ్బందితో కలసి మండలంలోని పలు ఆదివాసి గ్రామాల ప్రజలకు, ఛత్తీస్ గడ్ సరిహద్దు గ్రామాల గిరిజనులకు నిపుణులైన డాక్టర్ల బృందం చేత సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దుమ్ముగూడెంలోని ఐటిడిఎ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రెండు వేల మందికిపైగా ఆదివాసీ ప్రజలు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. తమ కంటి చూపును మెరుగుపరచుకోవడం కోసం చికిత్సలో పాల్గొనడం జరిగిందని, అలాగే చూపు సరిగ్గా లేక బాధపడుతున్న వారు సుమారుగా 500కి పైగా కళ్ళజోళ్ళను పంపిణీ చెయ్యడం జరిగిందని అన్నారు.

అలాగే కంటి చూపు సరిగా లేని 200 మందికి శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్పీ వినీత్.జి ఐపీఎస్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అండగా ఉండేందుకు ఈ మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న ఆదివాసి గిరిజనులకు అన్నిరకాల సదుపాయాలను అందజేయడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు.

Next Story

Most Viewed