కామారెడ్డిలో విషాదం.. అప్పుల బాధతో మాజీ నక్సలైట్ ఆత్మహత్య

by  |
Former Naxalite Narsimhulu
X

దిశ, కామారెడ్డి: ఆయన మాజీ నక్సలైట్. 20 ఏళ్ల పాటు జనశక్తి దళంలో క్రియాశీలకంగా పనిచేశాడు. కూడెల్లి దళంలో కమాండర్‌గా పనిచేశాడు. అనారోగ్య సమస్యలు తీవ్రతరం కావడంతో ఐదేళ్ల క్రితం పోలీసులకు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం గడుపుతున్నాడు. అనారోగ్య సమస్యలతో పాటు అప్పుల బాధలు పెరిగి మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బీబీపేట మండలం కొనాపూర్ గ్రామానికి చెందిన దుంపల నర్సింలు అలియాస్‌ ‌బుచ్చన్న(58) 20 ఏళ్ల క్రితం నక్సల్స్ భావజాలానికి ఆకర్షితుడై జనశక్తి దళంలో చేరాడు. 20 ఏళ్లుగా అందులోనే కూడవెళ్లి దళ కమాండర్‌గా పనిచేశాడు.

నిరంతరం ఉద్యమం కోసమే పరితపించి, దళంలో క్రియాశీలకంగా పనిచేశాడు. ఆ సమయంలో నర్సింలును అనారోగ్య సమస్యలు వెంటాడాయి. దాంతో పోలీసులకు లొంగిపోయి ఇంటివద్దే ఉంటున్నాడు. తనకున్న వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు వివాహం చేశాడు. అప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్న నర్సింలుకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దాంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నర్సింలు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. నర్సింలు మృతిపట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. అడవిని వీడి ప్రశాంతంగా జీవిస్తున్న నర్సింలు ఆత్మహత్య అందరినీ కలిచివేసింది.


Next Story

Most Viewed