అప్పుల ఆంధ్రాగా మార్చేశారు : యనమల రామకృష్ణుడు

by  |
అప్పుల ఆంధ్రాగా మార్చేశారు : యనమల రామకృష్ణుడు
X

దిశ, ఏపీ బ్యూరో: అప్పులు తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించిందని మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లలో పెద్దఎత్తున అప్పులు పెరిగాయని ఆరోపించారు. మంగళగిరిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులకు లెక్కా పత్రం లేవని ధ్వజమెత్తారు. రెండేళ్లలో ప్రభుత్వం 2లక్షల 68వేల 835 కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఆరోపించారు.

ఈ అప్పులో 1లక్షా 5వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేశామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారని.. వాస్తవంగా సంక్షేమానికి 68వేల 632 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని ఆధారాలతో సహా వివరించారు. మిగిలిన లక్షా 99 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయో చెప్పాలని యనమల నిలదీశారు. ప్రభుత్వం కేపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌ కోసం రూ. 31వేల కోట్లు ఖర్చు చేసిందని మిగిలిన లక్షా 68 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయో వివరణ ఇవ్వాలన్నారు. మిగిలిన సొమ్ము ఎవరి జేబులోకి మళ్లించినట్టు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రెవెన్యూ కోసం ఖర్చు చేస్తే ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించినట్టేనని యనమల ధ్వజమెత్తారు. అప్పుగా తెచ్చిన, ఆస్తులు తాకట్టు పెట్టగా వచ్చిన సొమ్ము ఏమవుతోందో ప్రజలకు వివరించాలని.. రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed