నేనున్నాను.. ‘నీట్’ ర్యాంకర్‌‌కు జేడీ లక్ష్మీ నారాయణ హామీ..!

by  |
నేనున్నాను.. ‘నీట్’ ర్యాంకర్‌‌కు జేడీ లక్ష్మీ నారాయణ హామీ..!
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : నీవు ఎంబీబీఎస్ చదవడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తాను. ఏ మాత్రం అధైర్య పడకమ్మా ధైర్యంగా కోర్సులో చేరు. ఇటీవల విడుదలైన నీట్ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మహబూబ్ నగర్‌‌కు చెందిన గోపికకు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ భరోసా ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న గోపిక అనే విద్యార్థిని.. తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితం కాగా, తల్లితో కలిసి చిన్న హోటల్ నడుపుతూనే నీట్ ఎంట్రన్స్ రాసింది. గతేడాది మంచి ర్యాంకు వచ్చినా ఆర్థిక పరిస్థితులు బాగలేక వైద్య విద్యను అభ్యసించలేకపోయింది. ఈ ఏడాది మరోసారి ప్రయత్నించి రాష్ట్ర స్థాయిలో 283వ ర్యాంకు సాధించింది. ఈ ఏడాది కూడా ఆర్థిక సమస్యల కారణంగా వైద్య విద్యను అభ్యసించే పరిస్థితులు లేకుండా పోయాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.

గోపిక గురించి తెలిసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ శనివారం గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్‌కు ఫోన్ చేసి ఆ విద్యార్థిని వివరాలు తెలుసుకోమని కోరాడు. వెంటనే రవీందర్ నాయక్ పాలమూరు విశ్వవిద్యాలయం గిరిజన విద్యార్థి సంఘం నాయకులు రాము. వినయ్, శివ తదితరులతో కలిసి గోపిక ఇంటికి వెళ్లి వివరాలను తెలుసుకుని లక్ష్మీనారాయణకు తెలిపారు. దీంతో లక్ష్మీనారాయణ మరోసారి ఫోన్ చేసి నేరుగా విద్యార్థిని గోపికతో మాట్లాడి కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. వైద్య విద్యకు అవసరమైన మొత్తం ఖర్చు తాను భరిస్తాను. కోర్సులో చేరమని జేడీ లక్ష్మీనారాయణ చెప్పడంతో గోపిక ఎంతో సంతోషించింది. తన చదువు ముందుకు సాగడానికి అండగా నిలిచిన మాజీ సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ, అందుకు సహకరించిన రవీందర్ నాయక్‌కు గోపిక, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed