అటవీశాఖ కొత్త స్కెచ్.. పైసలిస్తే సైలెంట్ లేదా వైలెంట్..!

by  |
అటవీశాఖ కొత్త స్కెచ్.. పైసలిస్తే సైలెంట్ లేదా వైలెంట్..!
X

దిశ, భూపాలపల్లి : భూపాల్‌పల్లి జిల్లాలోని పందిపంపుల గ్రామంలో అటవీశాఖ అధికారులు గురువారం రాత్రి రైతులకు చెందిన పత్తి పంటలను ధ్వంసం చేశారు. రైతులు రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో సాగు చేసుకుని పత్తి పంట వేశారనే నెపంతో అటవీశాఖ అధికారులు పత్తి పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. గ్రామ శివారులోని 30 ఎకరాల్లో సాగైన పత్తి పంటను అధికారులు నాశనం చేశారు. 30 ఎకరాల పంటలో మూడు ఎకరాలు పూర్తిగా ధ్వంసం కాగా, మిగతా 27 ఎకరాల భూమి పాక్షికంగా దెబ్బతిన్నది. పందిపంపుల గ్రామంలోని 34 సర్వేనెంబర్‌లో గల 30 ఎకరాల భూమిని గత 20 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నామని, రైతుబంధుతో పాటు బ్యాంకులు రుణాలు కూడా ఇస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అదే విధంగా ఈఏడాది పంట వేసుకుంటే అధికారులు అడ్డుకోవడంతో పాటు పంటను నాశనం చేశారని వాపోయారు. దీంతో బాధిత రైతులు అటవీ భవన్ ఎదుట సుమారు 4 గంటల పాటు వంద మంది ధర్నా నిర్వహించారు. అనంతరం అటవీ శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

బెదిరించి డబ్బులు తీసుకున్నారు

పందిపంపుల గ్రామంలో కొంత మంది అటవీశాఖ అధికారులు ఎకరానికి రూ.10వేలు చొప్పున వసూలు చేస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. సంగెం బిందు మాధవ్ అనే అటవీశాఖ అధికారి కొమ్ము మంజుల నుంచి రూ. 10వేలు తీసుకున్నట్టు ఆధారాలున్నాయి. జులై 29వ తేదీన ‘ఫోన్ పే’ద్వారా ఆ అధికారికి డబ్బులు పంపించారు. మిగతా రైతుల నుండి నగదు రూపంలో డబ్బులు తీసుకున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.

పోడు భూముల్లో రైతులకు పట్టాలివ్వాలి..

పందిపంపులలో రైతుల పంటకు నష్టం చేసిన అటవీశాఖ అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఫార్వార్డ్ బ్లాక్ నాయకులు గండ్ర సత్యనారాయణ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అటవీ భవన్ ముందు రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతు పలికారు. ప్రభుత్వం వెంటనే పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పాసుబుక్కులు ఇవ్వాలన్నారు. అంతేకాకుండా తగు విధమైన హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

అటవీశాఖ రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ వారి నుండి డబ్బులు వసూలు చేసుకుంటూ.. వారి పంటలనే ధ్వంసం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను వెంటనే అమలు చేయాలని, అటవీ భూములకు పట్టాలు మంజూరు చేసి రైతు బంధు, రైతు బీమా, సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీపీఎం నాయకులు బంధు సాయులు, అంబాల శ్రీను, రాంనేని రవీందర్, బుర్ర కోమరయ్య, తోట సంతోష్, కౌన్సిలర్లు దాట్ల శ్రీను, ఉడుత సరోజన-రాయమల్లు, కురిమిళ్ల రజిత-శ్రీను, యూత్ నాయకులు రాజేందర్, తోట రంజిత్, అశోక్, రజినీకాంత్, మహేందర్, విజయ్, రాజేష్ పాల్గొన్నారు.


Next Story