ఆ ఐదు టెస్టులు ప్రభుత్వ ల్యాబ్‌లలోనే

by  |
ఆ ఐదు టెస్టులు ప్రభుత్వ ల్యాబ్‌లలోనే
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్‌తో పాజిటివ్ పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో వైద్యారోగ్య శాఖ కొన్ని అదనపు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా ఆరోగ్యం విషయమించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న పేషెంట్లకు తప్పనిసరిగా చేయాల్సిన ఐదు రకాల వైద్య పరీక్షలను ఇకపైన ’తెలంగాణ డయాగ్నస్టిక్’ కేంద్రాల్లోనే చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. డీ-డైమర్స్, సీఆర్‌పీ, ఐఎల్-6, ఫెర్రిటిన్, ఎల్‌డీహెచ్ అనే ఐదు పరీక్షల శాంపిల్ళను విధిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలకు మాత్రమే పంపాల్సిందిగా ఆయా ఆసుపత్రుల హెడ్‌లకు ఆదేశాలు జారీచేసింది. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని ఆసుపత్రుల నుంచి ఆ శాంపిళ్ళను నారాయణగూడలోని ఐపీఎం (ఇన్‌స్టిట్యూట్ ఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)లోని డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపాల్సిందిగా సూచించింది. ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి.

జిల్లాల్లోని శాంపిళ్ళను కూడా అక్కడి డయాగ్నస్టిక్ కేంద్రాలకు పంపాల్సిందిగా సూచించింది. ఇందుకు అవసరమైన పరికరాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నందున అవసరమైన రీ-ఏజెంట్లను కూడా తగిన మోతాదులో పంపడానికి ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు లాబ్‌లలో ఈ పరీక్షల ఖర్చు ఎక్కువగా ఉన్నందున పేషెంట్లకు ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొ,ది. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ దృష్టి పెట్టని ప్రభుత్వం సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.

పేషెంట్లందరికీ రెమిడెసివిర్ అవసరం లేదు

గతేడాది కరోనా సమయంలో పేషెంట్లకు రెమిడెసివిర్ దివ్య ఔషధం అనే అభిప్రాయం ఉన్నప్పటికీ వైద్యపరమైన, శాస్త్రీయ ఆధారాలేవీ లేవు. కానీ ఏడాది అనుభవం తర్వాత దానిపైన వచ్చిన అవగాహనతో సెకండ్ వేవ్‌లో సీరియస్ కండిషన్‌తో వస్తున్న పేషెంట్లకు ఈ ఇంజెక్షన్లను ఇవ్వడం సాధారణంగా మారిపోయింది. దీంతో ఈ ఔషధానికి జాతీయ స్థాయిలోనే కొరత ఏర్పడింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల దగ్గర కలిపి కేవలం రెండు కోట్ల డోసుల స్టాక్ మాత్రమే ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో ఇది యాభై వేల మేరకు ఉంటుందని రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ పేర్కొంది. కనీసంగా మూడు లక్షల డోసులను సిద్దం చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది.

ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వైద్యారోగ్య అధికారి ఒకరు ‘దిశ‘తో మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ పేషెంట్లందరికీ రెమిడెసివిర్ ఇవ్వాల్సిన అవసరం లేదని వివరించారు. కేవలం మోడరేట్ తీవ్రత ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలని, మైల్డ్ లేదా సీరియస్ లేదా సివియర్ కండిషన్ ఉన్నవారికి ఇవ్వకూడదని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ సూచించిన ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్ ప్రకారం దీన్ని పరిమిత స్థాయిలో మాత్రమే వాడాలని నొక్కిచెప్పారు. మందుల దుకాణాల్లో వీటి అమ్మకాన్ని నిలిపివేసి కేవలం ఆసుపత్రులకు మాత్రమే సరఫరా చేసే విధానం అమలవుతోందని గుర్తుచేశారు. పేషెంట్లందరికీ అవసరం అనే కోణం నుంచి కార్పొరేటు ఆసుపత్రులు ఈ మందు ధరను రెండున్నర రెట్ల ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని, కొన్నిచోట్ల కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఉదాహరణలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, అందువల్లనే వైద్యారోగ్యం, డ్రగ్ కంట్రోల్ అధికారులు సీరియస్‌గా వ్యవహరించాలనే నిర్ణయం జరిగిందని పేర్కొన్నారు.

అదనపు వెంటిలేటర్లు

సెకండ్ వేవ్ ఉధృతికి తగినట్లుగా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఎక్కువ మంది ఊపిరితిత్తులు, గుండె సంబంధ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు తెలిపారు. ఆసుపత్రుల్లో బెడ్‌ల లభ్యత ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడున్న వార్డుల్లో అదనంగా ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాన్ని కల్పించడం అనివార్యమని వైద్యారోగ్య భావిస్తోంది. ఇందుకోసం ఆయా ఆసుపత్రుల్లో పేషెంట్ల కండిషన్‌పై ఆరా తీసి తక్షణం ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్ బెడ్‌ల సంఖ్యను పెంచాలనుకుంటోంది. కనీసంగా 15 వేల ఆక్సిజన్ బెడ్‌లు, ఐదు వేల ఐసీయూ బెడ్‌లు, 1500 వెంటిలేటర్ బెడ్‌లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా సమకూర్చాలనుకుంటోంది. ఆక్సిజన్‌కు ప్రస్తుతం కొరత లేదని పేర్కొన్న ఆ అధికారి మున్ముందు కేసుల సంఖ్య పెరిగితే దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుదన్నారు.

Next Story

Most Viewed