మార్ఫింగ్ వీడియో కావొచ్చు... ఎలా అరెస్ట్ చేస్తారు: పిన్నెల్లి తరపు వాదనలు ఇవే!

by srinivas |
మార్ఫింగ్ వీడియో కావొచ్చు... ఎలా అరెస్ట్ చేస్తారు:  పిన్నెల్లి తరపు వాదనలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం మధ్యాహ్నం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా పిన్నెల్లి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. నోటీసులు ఇవ్వకుండా పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామనడం సరికాదన్నారు. ట్విట్టర్ వీడియో ఆధారంగా ఆయనను పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. మార్ఫింగ్ వీడియో అయి ఉండొచ్చుకదా అని అనుమానం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం మిషన్లను ధ్వంసం చేశారని పోలింగ్ అధికారి చెప్పినట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్‌లో కూడా అదే ఉందన్నారు. 13న ఘటన జరిగితే 15న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిన్నెల్లిపై ఎన్నికల సంఘం నేరుగా ఆదేశాలు ఇవ్వడం సరికాదని న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే కౌంటర్ దాఖలకు ఎన్నికల సంఘం సమయం కోరింది.

కాగా ఏపీలో 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ వద్ద ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి వెళ్లి బీభత్సం సృష్టించారు. ఈవీఎం మెషిన్ ‌ ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనపై పోలింగ్ సిబ్బంది ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అందజేశారు. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పిన్నెల్లిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పిన్నెల్లిపై దాదాపు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈసీ చర్యలతో పిన్నెల్లి నియోజకవర్గం నుంచి పరారయ్యారు. దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. పిన్నెల్లి డ్రైవర్, గన్‌మెన్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్టారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Next Story

Most Viewed