మోడీజీ.. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న నా తల్లిదండ్రులను వేధించొద్దు: కేజ్రీవాల్‌

by Harish |
మోడీజీ.. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న నా తల్లిదండ్రులను వేధించొద్దు: కేజ్రీవాల్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ-కేజ్రీవాల్‌కి మధ్య జరుగుతున్న పోరులోకి నా తల్లిదండ్రులను లాగవద్దని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. నా తల్లిదండ్రులు వృద్ధులు, వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారిని వేధించవద్దని కేజ్రీవాల్ కోరారు. గురువారం మాట్లాడిన ఆయన, మోడీకి ఇది నా విజ్ఞప్తి. ప్రధానమంత్రి గారు మీరు నన్ను కిందకు లాగడానికి అనేక ప్రయత్నాలు చేశారు, మీరు నా ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు, నన్ను అరెస్టు చేశారు, తీహార్‌లో నన్ను అనేక రకాలుగా వేధించారు. కానీ నేను లొంగలేదు. ఈ రోజు మీరు అన్ని పరిమితులను దాటారు. మీరు నన్ను అరెస్టు చేసిన రోజున నా తల్లి చాలా అనారోగ్యంతో ఉంది, నా తండ్రికి 85 సంవత్సరాలు ఉన్నాయి. విచారణ పేరిట వారిని ఎందుకు వేధిస్తున్నారు అని కేజ్రీవాల్‌ అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ప్రకటన రావడంతో దీనికి ప్రతిస్పందనగా కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఈ విచారణ వాయిదా పడింది. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్ నివాసాన్ని సందర్శించి ఆయన తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.

పోలీసులు కేజ్రీవాల్‌ తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని విచారణ చేయడానికి చూస్తున్నారని ఢిల్లీ మంత్రి అయిన అతిషి తాజాగా అన్నారు. దీనిని రాజకీయ ప్రేరేపిత చర్యలుగా ఖండించారు, ఢిల్లీ ప్రజలు తమ ఓట్ల ద్వారా సమాధానం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. వృద్ధులను, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను వేధించేంతగా మన ప్రధాని దిగజారిపోయారా? దేశంలో రాజకీయాలు ఇంత దిగజారిపోయాయని నేను అనుకోను అని అతిషి అన్నారు.

Next Story

Most Viewed