అనారోగ్యంతో… ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి

by  |
అనారోగ్యంతో… ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి నటించిన మెర్సల్ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ అదరగొట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం భారీగా వసూళ్లు కూడా సాధించింది. అయితే ఈ చిత్రంలో విజయ్ రూ.5 డాక్టర్‌గా కనిపించారు. అయితే ఈ చిత్రంతో వెలుగులోకి వచ్చిన నిజ జీవిత రూ.5 డాక్టర్ వీర రాఘవన్ అనారోగ్యతో మృతిచెందాడు. గురువారం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని దక్షిణ మధ్య రైల్వే ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన ఆయన శనివారం మృతిచెందినట్టు కుటుంబీకులు తెలిపారు.

నార్త్ చెన్నైలోని వ్యాసర్ పాడి ప్రాంతలో ఆయన 1973లో అశోక స్తంభానికి సమీపంలోని ఎరుక్కంచెరి ప్రాంతంలో డాక్టర్ వీర రాఘవన్ మొట్ట మొదట క్లినిక్ స్థాపించాడు. మొదట రూ.2లకే వైద్యం అందించే వారు. మంచి హ‌స్త‌వాసి అనే పేరు కూడా ఉండ‌టంతో రోగుల‌తో క్లినిక్ కిట‌కిట‌లాడేది. ఎవరు ఎంత చెప్పినా, ఏది వినకుండా చివరివరకూ నమ్మిన ఆశయం కోసం బతికారు. 2015లో వరదల్లో వీర రాఘవన్ క్లినిక్​ పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి నుంచి సమీపంలోని మరో ప్రాంతంలో క్లినిక్​ ఏర్పాటు చేసినప్పటికీ తన ఫీజును మాత్రం ఐదు రూపాయలుగానే కొనసాగించారు.

ఎంతో పేదరికం నుంచి పైకొచ్చానని, అంతేగాకుండా తాను ఎలాంటి ఫీజు చెల్లించ‌కుండానే చ‌దువుకున్నాన‌ని, అందుకే త‌ను రోగుల నుండి డ‌బ్బులు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని ఆయన ప‌లు సంద‌ర్భాల్లో చెప్పాడు. వైద్యులు వీరరాఘవన్​కు భార్య సరస్వతి, ఇద్దరు పిల్లలు ప్రీతి, దీపక్​ ఉన్నారు. వారు కూడా వైద్యులుగానే స్థిరపడ్డారు. డాక్ట‌ర్ వీర ర‌ఘవ‌న్ మృతిప‌ట్ల త‌మిళ‌నాడు సీఎం, ప్ర‌తిప‌క్ష నేత‌, తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ నివాళి అర్పించారు.



Next Story

Most Viewed