ఐపీఎల్‌లో కెప్టెన్సీ వదులుకున్న దిగ్గజాలు

by  |
ఐపీఎల్‌లో కెప్టెన్సీ వదులుకున్న దిగ్గజాలు
X

దిశ, స్పోర్ట్స్: క్యాష్ రిచ్ లీగ్‌ అయిన ఐపీఎల్ (IPL) ద్వారా ఎంత ఆదాయం, పేరు వస్తుందో, ఆడే సమయంలో అంతకంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించే ఈ క్రికెట్ లీగ్ (Cricket League) ఒత్తిడి ఆటగాళ్లపై కంటే కెప్టెన్ల మీదే ఎక్కువగా ఉంటుంది. జట్టు వరుస ఓటములకు కెప్టెన్లే జవాబుదారీగా ఉండాలి. తమ వ్యక్తిగత ప్రదర్శన బాగున్నా, జట్టును నడిపించలేక ఐపీఎల్ సీజన్ (IPL season) మధ్యలోనే కొంత మంది క్రికెటర్లు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలో ఈ ఐదుగురి నిష్క్రమణ సంచలనాలకు దారి తీసింది.

కుమార సంగక్కర :
డెక్కన్ చార్జర్స్ (DC) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర 2012లో అర్ధాంతరంగా లీగ్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ సీజన్‌లో 7మ్యాచులకు గానూ 5మ్యాచ్‌లలో డీసీ (Deccan Chronicle)ఓడిపోయింది. వ్యక్తిగతంగా కూడా సంగక్కర ప్రదర్శన దారుణంగా ఉంది. దీంతో అతడు మధ్యలోనే కెప్టెన్సీని వదులుకున్నాడు. అనంతరం ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరూన్ వైట్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా యాజమాన్యం నియమించింది.

డేనియెల్ వెటోరి :
ప్రతి ఏడాదీ ‘ఈసారి కప్పు మాదే’ అంటూ బరిలోకి దిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు, పాయింట్ల టేబుల్‌లో మాత్రం చివర్లోనే ఉంటుంది. ఈ జట్టును నడిపించిన కివీస్ స్పిన్నర్ డేనియెల్ వెటోరి 2012లో లీగ్ మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. జట్టు సరైన ప్రదర్శన చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతని తర్వాత సీనియర్ అయిన ముత్తయ్య మురళీధరన్‌కు కెప్టెన్సీ ఇస్తారని అందరూ భావించినా, జట్టు యాజమాన్యం మాత్రం విరాట్ కోహ్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.

ఆడమ్ గిల్‌క్రిస్ట్:
డెక్కన్ చార్జర్స్ జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (Kings XI Punjab) జట్టు కెప్టెన్‌గా నియమించుకుంది. అయితే, 2011 సీజన్‌లో తాను సరైన ప్రదర్శన చేయలేకపోతున్నానని, బెంచ్ మీద ఉన్న షాన్ మార్ష్ జట్టులోకి రావాలంటే తాను తుది జట్టులో ఉండకూడదని భావించి ఆడమ్ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. దీంతో అతని బదులు డేవిడ్ హస్సీని పంజాబ్ జట్టు కెప్టెన్‌గా నియమించింది.

రికీ పాంటింగ్:
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు 2013లో కెప్టెన్‌గా వ్యవహరించిన రికీ పాంటింగ్ కేవలం ఆరు మ్యాచ్‌ల వరకు మాత్రమే ఉన్నాడు. తన పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా తప్పుకోవడంతో ముంబై యాజమాన్యం రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించింది. కెప్టెన్‌గా తప్పుకున్న పాంటింగ్‌ను యాజమాన్యం కోచ్‌గా నియమించింది. అదే సీజన్‌లో ముంబై జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడం విశేషం.

గౌతమ్ గంభీర్:
ఐపీఎల్ చరిత్రలో గౌతమ్ గంభీర్ నిష్క్రమణ ఎంతో సంచలనానికి దారి తీసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తనను తిరిగి తీసుకోకపోవడంతో.. ఢిల్లీ డేర్ డెవిల్స్ (Delhi Daredevils) జట్టులోకి వచ్చాడు. 2018లో డీడీ (DD) జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్, కెప్టెన్సీని మాత్రమే కాకుండా తన క్రికెట్ కెరీర్‌కూ గుడ్ బై చెప్పాడు. ఇది ఢిల్లీ జట్టునే కాకుండా అభిమానులను కూడా షాక్‌కు గురి చేసింది. అయితే, గంభీర్ సూచన మేరకే ఢిల్లీ యాజమాన్యం శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఆ ఏడాది ఢిల్లీ జట్టు తొలిసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం గమనార్హం.



Next Story

Most Viewed