దుబ్బాక బరిలో కలియుగ పాండవులు

by  |
దుబ్బాక బరిలో కలియుగ పాండవులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ ఐదుగురు యువకులే హైలైట్. ‘కలియుగ పాండవులు’ పేరిట వివిధ ప్రాంతాల నుండి ఓ వేదిక మీదకు చేరారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పోటీ చేయాలని భావించి దుబ్బాక ఉప పోరు బరిలో నిలిచారు. తమ గెలుపు కోసం కాకుండా ప్రజలే విన్నర్స్ కావాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ప్రజలకు ఓటు విలువ వివరించాలన్నదే తమ లక్ష్యమని ఈ ‘కలియుగ పాండవులు’ చెబుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురు, హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన ఒకరు వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు ఓటు విలువ వివరించాలన్న సంకల్పంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆ ఐదుగురు అభ్యర్థుల నేపథ్యం కూడా విచిత్రంగా ఉంది. పెద్దపల్లి జిల్లా వెల్గటూరు మండలం అంబారిపేటకు చెందిన మోతె నరేశ్, సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన బుర్ర రవితేజ, కరీంనగర్‌కు చెందిన కోట శ్యాం కుమార్, చొప్పదండికి చెందిన మీసాల రాజ్యసాగర్, హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన చిన్నధన్ రాజ్ దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిల్చున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వీరు ఒకేసారి ఒకే చోట పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తమ లక్ష్యం గెలుపు కాదని, ప్రజలకు ఓటు హక్కు విలువ తెలియజేయడమేనని వారు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం తమవంతు ప్రయత్నంగా ఉద్యమాలు చేస్తున్నామని వివరిస్తున్నారు. ఒకేసారి పోటీ చేయడం వల్ల ప్రజల్లో మార్పు తీసుకురాగలుగుతామనే నమ్మకం తమకు ఉందంటున్నారు.

సోషల్ మీడియా ద్వారా…

తాము ఎంచుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు తరుచూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేసుకుంటూ ఉండేవారు. వారంతా తమ అభిప్రాయాలు ఒకే విధంగా ఉన్నాయని భావించారు. దీంతో అందరూ ఫోన్ నెంబర్లు తీసుకుని రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూ ఉండేవారు. సమాజంలో పేరుకుపోయిన సమస్యలతో పాటు, ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు విలువ ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భావించారు. అందుకు వారంతా ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిల్చొని ఓటు విలువను ప్రజలకు తెలియజేస్తున్నారు. తాము ఎంచుకున్న ఈ కార్యక్రమంతో రాత్రికి రాత్రే మార్పు వచ్చే అవకాశం లేదని తెలిసినా నిరంతర ప్రక్రియగా ముందుకు సాగితే సమాజంలో తప్పకుండా మార్పు వస్తుందని ఈ ‘కలియుగపాండవులు’ భావిస్తున్నారు.


Next Story