రాలిన పసిమొగ్గలు.. క్షణికావేశమే కారణమా!

by  |
రాలిన పసిమొగ్గలు.. క్షణికావేశమే కారణమా!
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఇంటి ముంగిట వికసించాల్సిన పసిమొగ్గలు అన్యాయంగా నేల రాలుతున్నాయి. చిన్నారుల అల్లరితో సందడిగా ఉండాల్సిన ఇళ్లు మూగబోతున్నాయి. కుటుంబంలో చోటుచేసుకునే చిన్నచితక తగాదలే అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో పెద్దలు చేసే తప్పిదాలకు అభంశుభం తెలియని పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. దానంతటికి తల్లిదండ్రులు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలే ముఖ్యకారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఓకే రోజు వ్యవధిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు చిన్నారులతో సహా ఓ మహిళ బలైంది. ఒక్క క్షణం ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం వలన రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవల వలన రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

నాగర్ కర్నూల్‌లో ఇద్దరు చిన్నారులు..

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గడ్డంపల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారులు నీటి సంపు గుంతలో పడి మృతిచెందారు. ఇందులో తండ్రి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడ్డంపల్లికి చెందిన నిర్మలయ్యకు కొన్నేండ్ల కిందట పెద్దాపూర్ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది. వీరికి కిట్టు (5), అమ్ములు(3) అనే ఇద్దరు పిల్లలున్నారు.అయితే, కొంత కాలంగా వీరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఏడాది కిందట భాగ్యలక్ష్మి ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది. మూడ్రోజుల కిందట నిర్మలయ్య పెద్దాపూర్‌కు వెళ్ళాడు. భార్యతో గొడవపడి పిల్లలను తీసుకుని గడ్డంపల్లికి వచ్చాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం నిర్మలయ్య పని కోసం బయటకు వెళుతూ పిల్లలను తన అన్న ఇంటి వద్ద వదిలి వెళ్ళాడు. తిరిగి వచ్చే సరికి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇంటిముందుగల సంపు గుంతలో పడి వారు చనిపోయారని తండ్రి చెబుతుండగా, నిర్మలయ్యనే పిల్లలను హత్య చేసి వుంటాడని భార్య తరపు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జోగుళాంబ గద్వాలలో నలుగురు..

జోగుళాంబ గద్వాల జిల్లాలోనూ అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు బలయ్యారు. గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం చెట్లమల్లాపురం గ్రామంలో మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. దానికి కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా దంపతులు తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం. దీంతో మనస్థాపానికి గురైన సత్యమ్మ మంగళవారం తన ముగ్గురు పిల్లలు నందిని(10), శివాని(4), బుజ్జి(1)తో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వారం వ్యవధిలోనే రెండు వేర్వేరు ఘటనల్లో ఐదు మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడం బాధకరమైన విషయం.



Next Story

Most Viewed