మంత్రి గారూ.. మీ సహాయాన్ని ఆపొద్దు : టీపీటీఎఫ్

by  |
TPTF
X

దిశ, వెబ్‌డెస్క్ :ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇస్తున్న ఆపత్కాల సహాయాన్ని కొసాగించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ (టీపీటీఎఫ్) డిమాండ్ చేసింది. ఆర్భాటంగా ప్రతి ఉపాధ్యాయుడికి రూ.2 వేల నగదు, 25 కిలోల బియ్యం ఇస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం రెండు నెలలకే ఆపేసిందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు బయ్యా శివరాజ్ మండిపడ్డారు. భౌతిక క్లాసులు ప్రారంభం అయ్యే వరకు ప్రభుత్వ సహాయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తోటి ఉపాధ్యాయులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

అనంతరం శివరాజ్ మాట్లాడుతూ ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయని ఆపత్కాల సహాయాన్ని నిలిపి వేయవద్దని కోరారు. ఇప్పటికీ ప్రైవేట్ ఉపాధ్యాయులకు యాజమాన్యాలు జీతాలు ఇవ్వడం లేదనీ, కనీసం వారిని విధుల్లోకి కూడా తీసుకోవడం లేదని వాపోయారు. యాజమాన్యాలు సైతం మేము ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం లేదనీ, సహాయాన్ని కొనసాగించాలనీ కోరుతున్నారని, ప్రభుత్వం మా పరిస్థితులను అర్థం చేసుకోని సహాయాన్ని కొనసాగించాలని మంత్రిని కోరారు. ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తున్న ఈ సహాయాన్ని నిలిపివేస్తే ప్రైవేట్ ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.

ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ఫ్రారంభమయ్యే వరకు సహాయాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, వారి వినతిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని తెలిపారు. బయ్యా శివరాజ్ తోపాటు మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు కర్నె సురేందర్, మేడ్చల్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ప్రేమలత మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

Next Story

Most Viewed