దశాబ్దంగా మూగజీవాల ఆకలి తీరుస్తున్న కడప వాసి

by  |
దశాబ్దంగా మూగజీవాల ఆకలి తీరుస్తున్న కడప వాసి
X

దిశ, ఫీచర్స్ : అన్నార్థుల కడుపు నింపడానికి ఎంతోమంది సహృదయులు ఉన్నారు. కానీ మూగజీవాల ఆకలి తీర్చడంలో సాయపడేది కొద్దిమంది మాత్రమే. అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు కానీ నోరు విడిచి అడగలేని జంతువులకు పదేళ్లుగా ఆహారాన్ని అందిస్తూ తన సహృదయతను చాటుకుంటున్నాడు కడపకు చెందిన షేక్ బాషా మొహియుద్దీన్. 2011 నుంచి ప్రతీ ఆదివారం ఆవులు, కోతులు, జింకలు, ఉడుతలు, కుక్కలు, పిల్లులు, పావురాలు, చిలుకలు, కాకులు, పిచ్చుకలకు రకరకాల ఆహార పదార్థాలను తినిపిస్తున్నారు. ఈ క్రమంలో ‘ఫ్రెండ్ ఆఫ్ యానియల్స్’కు పర్యాయపదంగా మారిన ఆ జంతు ప్రేమికుడి విశేషాలు మీకోసం..

కడప, కోఆపరేటివ్ కాలనీలో ‘బి -3’ జిమ్ సెంటర్‌ నిర్వహిస్తున్న బాషా గత దశాబ్దకాలంగా మూగ జీవాల సేవలో గడుపుతున్నాడు. ఎండ, వాన, వరదలు, కరోనా వంటి ఏ విపత్తు కూడా మూగజీవాల కడుపు నింపడంలో ఆయనను ఆపలేకపోయాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రతీ ఆదివారం బాషా ఆయా జంతువులకు ఆహారాన్ని అందిస్తూనే ఉంటాడు. 2011లో సిద్దవటంలోని ఒక అటవీ ప్రాంతం నుంచి వెళుతున్న క్రమంలో నీళ్లు లేక అలమటిస్తున్న కోతుల సమూహాన్ని చూసిన బాషా.. వాటికి ఓ వాటర్ బాటిల్ అందించాడు. అయితే ఆ నీటిని తాగేందుకు ఒకదానితో ఒకటి గొడవ పడ్డాయి.

అది తన మనసును కదలించడంతో మరుసటి ఆదివారం డబ్బాల్లో నీళ్లు నింపుకుని ఆ కోతులున్న ప్రదేశానికి వెళ్లి ఓ గుంతలో వాటిని పోశాడు. ఈ పని తనకు చాలా సంతృప్తిగా అనిపించడంతో ఆ క్షణం నుంచి మూగజీవాలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి ప్రతీ ఆదివారం ఓ ఆటోలో నీళ్లను తీసుకెళ్లడం ఆ గోతిలో పొయ్యడం ప్రారంభించడంతో పాటు వాటికోసం ఆహారాన్ని కూడా వెంట తీసుకెళ్లేవాడు. మెల్లగా ఆ కోతుల సమూహం బాషాకు అలవాటయ్యాయి. అలా మూగజీవాలతో బంధాన్ని ఏర్పరుచుకున్న బాషా.. స్థానికంగా ఆవులకు పశుగ్రాసాన్ని అందించడం, పిల్లులు, కుక్కలకు పాలు, మాంసాన్ని పెట్టడం ప్రారంభించాడు. తరువాత నగర శివార్లలోని భాకరాపేట, సిద్దవటం, అట్లూరు, రాపూరు, రామాపురం, గువ్వల చెరువు ఘాట్‌లోని జెఎంజె కాలేజీ వంటి ప్రాంతాల్లో నివసించే మూగజీవాలకు పండ్లు, కూరగాయలు, నీళ్లను అందిస్తూ తన సేవలను విస్తరించాడు.

‘ఈ పదేళ్లలో ఒక్క ఆదివారం కూడా మూగజీవాలను కలవకుండా ఉండలేను. నా చేతితో వాటికి తినిపిస్తుంటే వచ్చే ఆనందం, సంతృప్తి మరే పనిలో నాకు లభించలేదు. అవి నా ఆప్తమిత్రులు. కరోనా సమయంలో కూడా నా సేవను కొనసాగించాను. ఇందుకు పోలీసు సిబ్బంది కూడా సహకరించారు. నాకు వచ్చే డబ్బులో కొంత మొత్తాన్ని వాటికోసం ఖర్చు చేస్తున్నాను. వాటికి ఆహారాన్ని అందించడాన్ని ఎప్పుడూ భారంగా భావించలేదు, ఆపాలని అనుకోలేదు. నా బాధ్యతగా భావించి ఇష్టపూర్వకంగా చేస్తున్నాను. ప్రజలు జంతువులను తరిమికొట్టినప్పుడు బాధగా అనిపిస్తుంది. వాటితో కటువుగా ఉండకుండా స్నేహం చేయడం అలవరుచుకోవాలి. వాటి దుస్థితిని అర్థం చేసుకొని వాటికి తోచినంత ఆహారం ఇవ్వాలి. జంతువులకు ఆహారం దొరక్కపోవడానికి, ఆవాసాలు కోల్పోయి మానవ ప్రాంతాలకు రావడానికి.. చెట్ల నరికివేత, అటవీ నిర్మూలనే కారణం. జంతువుల ఆకలి తీర్చడాన్ని దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. నేను చేస్తున్న ఈ చిన్న పని నా జీవితానికి అర్థాన్ని, సంతృప్తిని అందిస్తున్నాయి’
– బాషా, యానిమల్ ఫీడర్



Next Story

Most Viewed